విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

 

టేకులపల్లి,అక్టోబర్ 19( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని సులానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై వేటు పడింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బుధవారం పిల్లల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుని నిలదీశారు. పాఠశాలలో గొడవ జరుగుతున్న విషయాన్ని ఎంఈఓ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే పాఠశాలకు వచ్చారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆయన సమక్షంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరును వివరించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిన అనంతరం పరిశీలించి ఆ ఉపాధ్యాయుడు పై గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పాఠశాలలో విద్యార్థినిలు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు.