విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.
మెదక్, సెప్టెంబర్ 8, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. గురువారం తన ఛాంబర్ లో డి.ఆర్..డి.ఓ. శ్రీనివాస్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, యునెస్కో జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ తో కలిసి క్రిములు కాదు ఆహారం తినండి అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఎక్కడైనా ఆహారం తినడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, లేకుంటే వ్యాధికారక క్రిములు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురిచేస్తాయని అన్నారు.
అనంతరం మెదక్ పట్టణంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థినులతో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఆహారం రుచికరంగా వండుతున్నారా అని వివరాలడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ ను సందర్శించి మెనూ చార్ట్ ను అక్కడ ఏర్పాటు చేయాలని వార్డెన్ కు సూచించారు. వంట గదిలో ఉన్న సరుకులను పరిశీలించి చక్కగా సర్ది పెట్టుకోవాలన్నారు. వంట గది వెనుక పారుతున్న మురుగు నీరును చూసి వెంటనే కాలువ తీసి మురుగు నీరు పోయేలా చూడవలసినదిగా అక్కడే ఉన్న మునిసిపల్ కమీషనర్ శ్రీహరిని ఆదేశించారు. వసతి గృహ గదులను సందర్శించి సరిపోను పరుపులు లేకపోతె పై అధికారులకు తెలిపి ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారు. ఆ తరువాత తరగతి గదులకు వెళ్లి అప్పుడే లెక్కల సబ్జెక్టు అయిన పాఠ్యంశంఫై పిల్లలను ప్రశ్నించి బోర్డుపై లెక్కలు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు ఎల్లపుడు పరిశుభ్రతను పాటించాలని, సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలని, పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటామని హితవు చెప్పారు. అలాగే జిల్లాలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని వసతి గృహాలలో స్నానపు గదులు, మూత్రశాలలు, వసతి గృహ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారంగా పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి శ్రీదేవి, జిల్లా సమన్వయ అధికారి, ప్రధానాచార్యులు వరలక్ష్మి , వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, ఉపాధ్యాయులు లక్ష్మి, సలోమి, మేషక్ , దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మెదక్ ద్వారా జారీ చేయనైనది.