విద్యుత్‌ ఉద్యోగులకు సీఎం వరాల జల్లు

1

జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ

సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : విద్యుత్‌ ఉద్యోగులకు సీఎం వరాల జల్లు కురిపించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన సవరణ కింద 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అంగీకరించారు. మంగళవారం ఈమేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యుత్‌ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అత్యంత ఉదారతతో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. జెన్‌కో ఛైర్మన్‌ డి.ప్రభాకార్‌, విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఎస్‌కె.జోషి, సిపిడిసిఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజి, రామిరెడ్డి, మోహన్‌రెడ్డి, సుధాకర్‌రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకుల ప్రతిపాదనలను పరిశీలించి సానుకూలంగా స్పందించారు. 30శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం అత్యంత సముచితమని అన్నారు. 15సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. ప్రస్తుతం విద్యుత్‌ శాఖలో 26,894 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి రూ.1233 కోట్ల జీతాలు చెల్లిస్తున్నారు. తాజా ఫిట్‌మెంట్‌ ప్రకారం రూ.500కోట్ల అదనపు భారం పడుతుంది. 19,292 మంది పెన్షనర్లకు ప్రస్తుతం రూ.583 కోట్ల మేర పెన్షన్లు ఇస్తున్నారు. ట్రాన్స్‌ కో, జెన్‌ కో ఉద్యోగులకు దీన్ని వర్తింపజేయనున్నారు. విద్యుత్‌ ఉద్యోగులకు 35 శాతం ఫిట్‌మెంట్‌, మూడు వెయిటేజీలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఇంధనశాఖ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో 27.5 శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సీఏం కేసీఆర్‌ అనుకున్నారు. అయితే దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు ఎన్టీపీసీ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని హావిూ ఇచ్చారని, ఇప్పుడు ఫిట్‌మెంట్‌ తక్కువ ఇవ్వడం సరికాదని సీఎంకు మొరపెట్టుకున్నారు. దీంతో ఉద్యోగులు కోరిన మేరకు 35 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇంధనశాఖకు సీఎం కేసీఆర్‌ సూచించారు. చివరకు 30 శాతం ఫిట్‌ మెంట్‌ ఖరారు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో విద్యుత్‌ ఉద్యోగులు సమావేశమయ్యారు. సమావేశానంతరం విద్యుత్తు సంఘాల నేతలు విూడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.