విద్యుత్‌ డైరెక్టర్లు తెలంగాణకే కేటాయించాలి

దేవీప్రసాద్‌ డిమాండ్‌
హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) :
విద్యుత్‌ సౌధలోని రెండు డైరెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ ఎదుట తెలంగాణ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ, విద్యుత్‌ సౌధాలో డైరెక్టర్‌ పోస్టులు ఆంధ్రవారికి కట్టబెడుతూ తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఏపీఎస్‌ఈబీ ఏర్పడిన నాటి నుంచి విద్యుత్‌ సౌధ ఆరో జోన్‌లో భాగంగానే ఉన్నప్పటికీ గడిచిన ఆరు దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతం వారికి డైరెక్టర్‌ పోస్టులు దక్కకుండా చేశారన్నారు. ఆరో జోన్‌లో ఉన్న విద్యుత్‌ సౌధలోని డైరెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే దక్కాల్సి ఉన్నా సీమాంధ్ర పాలకులు తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు కూడా డైరెక్టర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు, మెరిట్‌, షార్ట్‌ లిస్ట్‌ పేరుతో తెలంగాణ వారికి మళ్లీ అన్యాయం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్‌ సౌధలో తెలంగాణ డైరెక్టర్లు లేని కారణంగానే ఈ ప్రాంత రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కావడం లేదని తెలిపారు. విద్యుత్‌ పంపిణీ లో తీవ్ర అసమానతలు రూపుమాపాలంటే విద్యుత్‌ సౌధాలో ఈ ప్రాంత డైరెక్టర్లు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయమైన ఈ ఉద్యమానికి రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యుత్‌ సౌధాలో సీమాంధ్ర పెత్తానానికి వ్యతిరేకంగా పోరాటానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది ప్రతిఘటించాల్సిన సమయమని, ఇప్పుడు జాప్యం చేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌, టీజేఏసీ నాయకులు, విద్యుత్‌ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.