విద్వేషమే దాని ధ్యేయం

‘విశాలంధ’ పుస్తకావిష్కరణలో వక్తలు
హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) :
ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడమే విశాలాంధ్ర మహాసభ ధ్యేయమని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ అన్నారు. ఎన్‌. వేణుగోపాల్‌ రచించిన ‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ మహారభస పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు’ పుస్తకాన్ని మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం, హరీశ్‌ మాట్లాడుతూ,  విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకిస్తూ చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడని, దానికి సీమాంధ్ర మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తోందని వారు తెలిపారు. గత జనవరిలో ఢిల్లీలో తెలంగాణ అనుకూల నిర్ణయం ఏదో వస్తుందనే ఊహాగానాలు వచ్చినప్పుడు, ఆ నిర్ణయాన్ని ఎత్తగొట్టించడానికి పరకాల ప్రభాకర్‌ అండ్‌ కంపెనీ ఆ అబద్ధాలనే ఇంగ్లిషులో పుస్తక రూపంలో తెచ్చినవే అని పేర్కొన్నారు. ఆ పుస్తకంలో ప్రకటించిన అబద్ధాలన్ని అంతకు ముందు ఎన్నోసార్లు ఖండించినవేనని, ఆ వాదనలన్నింటికీ అంతకుముందు ఎంతో మంది తెలంగాణ మేధావులు దీటయిన జవాబులు చెప్పారన్నారు. మళ్లీ ఇంగ్లిష్‌ పుస్తకం వచ్చిన తరువాత కూడ చాల చోట్ల చర్చలు జరిగాయని, ఆ పుస్తకం ఎట్లా అబద్ధాలతో, అర్ధసత్యాలతో, వక్రీకరణలతో నిండి ఉన్నదో అనేక మంది వివరించారని పేర్కొన్నారు. కాని అవేవి పట్టించుకోకుండా మళ్ళీ అదే పుస్తకపు తెలుగు అనువాదాన్ని ఏప్రిల్‌ 16న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించడమే కాకుండా తన ప్రశ్నలకు తెలంగాణవాదులు జవాబు చెప్పలేదని, తాను రాసినవన్నీ నిజాలని రుజువైందని ప్రగల్భాలు పలికాడని విమర్శించారు. బాక్సింగ్‌ పోటీలలో ప్రత్యర్థిని పడగొట్టి పది వరకూ లెక్కపెట్టి అప్పటికి కూడ లేవకపోతే గెలుపు ప్రకటిస్తారని, అలాగే తాము కూడా ఎనభై రోజులు లెక్కపెట్టామని, తెలంగాణవాదులు మట్టికరిచారని, తమకు జవాబు చెప్పలేకపోయారని అహంకారపు కూతలు కూశాడన్నారు. ఈ పత్రికా సమావేశానికి హాజరయిన తెలంగాణ బిడ్డలు ఆ అహంకారాన్ని ప్రతిఘటించారని పేర్కొన్నారు. అయినా రెండు, మూడు వారాల తరువాత ఆంధ్రజ్యోతి పత్రికలో అవే కూతలు కూశాడని ఎద్దేవా చేశారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆరు దశాబ్దాలుగా సాగిన దోపిడీని, పీడనను, వంచనను, నమ్మక ద్రోహాలను తగుదునమ్మా అంటూ సమర్థిస్తున్నాడని అన్నారు. ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్న పరకాల ప్రభాకర్‌ రాతలకు, విశాలాంధ్ర మహాసభ పుస్తకానికి ఇప్పటికి కనీసం రెండు వందల పుస్తకాలలో, సాగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమంలో జవాబులున్నాయని పేర్కొన్నారు. అయినా తనకు జవాబులేదని విర్రవీగుతున్న పరకాల ప్రభాకర్‌, విశాలాంధ్ర మహాసభ ప్రచురించిన ”రుజువులు లేని ఉద్యమం – తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు” పుస్తకానికి సూటిగా అసలు నిజాలు జవాబులు చెప్పదల్చుకున్నామన్నారు. అందుకే పుస్తకాన్ని తీసుకువచ్చామని రచయిత వేణుగోపాల్‌ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హిస్టరీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ తడకమళ్ల వివేక్‌, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, తెలంగాణ ఎన్జీవోస్‌ యూనియన్‌ అధ్యక్షులు జి.దేవీప్రసాద్‌, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.