విలీన మండలాల ప్రజలకు స్థానికంగానే పునరావాసం: సున్నం

భద్రాచలం,జూన్‌4(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురికానున్న విలీన మండలాల్లోని గ్రామాలకు ప్రజలకు స్థానికంగానే పునరావాసం కల్పించాలని భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్‌ పనులు ప్రాంభం కావడంతో నిత్యం చురకుగా పనులు సాగుతున్నాయి. అయితే నిర్వాసితుల ఆందోళనలను కూడా కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.విఆర్‌.పురం మండలంలోని శ్రీరామగిరి,జీడిగుప్ప, ఇసునూరు, సీతంపేట, చొనలకపల్లి, తృష్ఠివారిగూడెం, జీడిగుప్పకాలని గ్రామాల ప్రజలకు పునరావాసం కోసం ఎటపాక, ఏడుగురాళ్ళపల్లి ప్రాంతాల్లో పునరావాసం కల్పించడం దారుణమన్నారు. మండలంలో 62 రెవెన్యూ గ్రామాలు, 13 శివారు గ్రామాలు కలిపి మొత్తం75 గ్రామాలు ఉన్నాయన్నారు. వీటిని 34 గ్రామాలు ముంపునకు గురి అవుతున్నాయని తెలిపారు. ముంపునకు గురికాని పెద్దమట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బూర్గువాడ, చిన్నచట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వెంకంపాలెం. కుందులూరు గ్రామ పంచాయతీ పరిధిలో తెల్లంవారి గూడెం, గుల్లేటివాడ, టేకులూరు, కుందులూరు, కారంగూడెం. ములకన పల్లి పంచాయతీ పరిధిలోని వీరపాపన కుంట, కుంజవారి గూడెం గ్రామాలవైపు విశాలమైన సారవంత మైన భూములు, వ్యవసాయానికి అనుకూలమైన నీటి వనరులు ఉన్నాయన్నారు. నిర్వాసితులకు ఇక్కడ పునరావాసం కల్పిం చాలన్నారు. విఆర్‌.పురంతోపాటు చింతూరు, కూనవరం, ఎటపాక నాలుగు విలీన మండలాల్లోనూ ఇదే విధంగా ప్రజలకు పునరావాసం కల్పిస్తే గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండదన్నారు. ప్రాజెక్టు కోసం సర్వత్యాగం చేస్తున్న నిర్వాసితులే దేవుళ్లు అంటున్న చంద్రబాబుకు ఇక్కడ దీక్షలు చేస్తున్న నిర్వాసితులు కన్పించలేదా అని ప్రశ్నించారు. పరిహారం.పునరావాసం, భూమికి భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉందన్నారు.