విలువల పునాదుల విూద తెలంగాణ ఏర్పాటు: దేశిపతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ వాళ్లకు అడ్వాన్సులు, కవిూషన్లు తప్ప ప్రజా సమస్యలు తెలియవని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ విలువలు, త్యాగాల పునాది విూద ఆవిర్భవించిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యకర్తల రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కరెంటు సమస్య తీరి ఉండేదా? అని దేశపతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి అగ్గి రాజేసింది ఉమ్మడి ఖమ్మం జిల్లా అని కొనియాడారు. తెలంగాణ నుంచి కరువును పారదోలాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రైతులకు భరోసా అని దేశపతి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓ మహా అద్భుతమని, దీన్ని కడుతున్న తెలంగాణ ఇంజనీర్ల కృషిని దేశం కీర్తిస్తోందని ఆయన కొనియాడారు. కాళేశ్వరం నీళ్లు పారితే గాంధీ భవన్‌ కిందకు నీళ్లొస్తాయని కాంగ్రెస్‌ భయం అని ఎద్దేవా చేశారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, సీఎం కాకుంటే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేవి కావన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత విజయాలను సొంతం చేసుకుందని తెలిపారు. రైతుబంధు పథకంతో ఆత్మహత్యలు లేని తెలంగాణను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల దృష్టి తెలంగాణపై పడిందన్నారు. రాష్ట్రమంతా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందనుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పథకం అమలుకానుందన్నారు. చనిపోయిన రైతుకు రూ. 5 లక్షల బీమా సొమ్ము కేవలం పది రోజుల్లోనే అందించనున్నట్లు వివరించారు. గత పాలకులు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. అప్పులు లేకుండా రైతు వ్యవసాయం చేయాలన్నదే కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 4 ఏళ్ల కాలంలో రైతు సంక్షేమాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వివరించారు.