విషమంగానే సరబ్‌జిత్‌ ఆరోగ్యం

మెరుగైన చికిత్సకు విదేశాలకు పంపం : పాక్‌
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
లా¬ర్‌, (జనంసాక్షి) : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తారని వచ్చిన వార్తలను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. ఆయనను ఎక్కడికి తరలించడం లేదని తేల్చి చెప్పింది. సరబ్‌జిత్‌ను వైద్యం కోసం విదేశాలకు తరలించాల్సిన అవసరం లేదని సోమవారం స్పష్టం చేసింది. తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న సరబ్‌జిత్‌ను మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించాలా? లేక, విదేశీ వైద్య నిపుణులను రప్పించాలా? అనే దానిపై పాక్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సరబ్‌జిత్‌ పరిస్థితిని పరిశీలించిన నలుగురు సభ్యుల కమిటీ విదేశాలకు తరలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న సరబ్‌జిత్‌ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ షౌకత్‌ మెహమూబద్‌, ప్రొఫెసర్‌ జాఫర్‌ ఇక్బాల్‌, ప్రొఫెసర్‌ అంజుమ్‌ హబీబ్‌, ప్రొఫెసర్‌ నయీమ్‌ కసురిలతో కూడిన కమిటీ సోమవారం సమీక్షించింది. తాజాగా నిర్వహించిన సీటీ స్కాన్‌ రిపోర్టును పరిశీలించింది. సరబ్‌జిత్‌ను, విదేశాలకు తరలించాలా? విదేశీ న్యూరోసర్జన్లను రప్పించాలా? అనే అంశంపై కమిటీ మల్లగుల్లాలు పడింది. గంటపాటు చర్చల అనంతరం చివరకు జిన్నా ఆస్పత్రిలోనే వైద్యం కొనసాగించాలని నిర్ణయించింది. అయితే, నిపుణుల కమిటీ ఏర్పాటుపై వచ్చిన వార్తలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదని కొట్టిపడేశాయి. ఇదిలా ఉంటే, లా¬ర్‌లోని జిన్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరబ్‌జిత్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన అచేతనావస్థలో ఉన్నారని, పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని పేర్కొన్నారు. అయితే బీపీ, రక్తంలో ఆక్సిజన్‌ శాతం మెరుగ్గాయని తెలిపారు. సరబ్‌జిత్‌ స్పృహలోకి వస్తాడని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడగానే, శస్త్రచికిత్స నిర్వహించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి.