వీరనారి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ అంజద్ అలీ అన్నారు.శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఎదురోడ్డి నిలిచి పోరాడిన యోధురాలని కొనియాడారు.సూర్యాపేట పట్టణంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తమ పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు
ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదన్నారు.మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వెలిశాల గ్రామంలో తన సొంత ఖర్చులతో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు.విగ్రహా ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి , అక్కినపల్లి జానయ్య , నరేందర్ నాయుడు, ఆలేటి మాణిక్యం, నాంపల్లి శ్రీను, నాగు నాయక్, గడ్డం వెంకన్న , నాగుల వాసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.