హయత్‌నగర్‌లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల డిమాండ్

విద్యా సంస్థలను మూసివేసి, నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు

హయత్‌నగర్, జులై 10 (జనం సాక్షి) రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు.. హయత్‌నగర్‌లో గురువారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ అత్యంత విజయవంతంగా ముగిసింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బంద్‌లో భాగంగా ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు హయత్‌నగర్ పరిధిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యాసంస్థలను మూసివేయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఈ పోరాటానికి విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి తరగతులను నిలిపివేశారు. విద్యార్థుల పక్షాన గళమెత్తి విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి బొంగు అరుణ్ కుమార్ గౌడ్, పిడీ ఎస్ యూ నాయకులు కొర్వి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు భూక్య వినోద్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈనపల్లి ఉపేందర్, మండల సంయుక్త కార్యదర్శి జూనోతల భాను ప్రకాష్ తదితరులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని బంద్‌ను జయప్రదం చేశారు.

తాజావార్తలు