చల్లగరిగలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం..

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/ చిట్యాల, (జనంసాక్షి):
చల్లగరిగలో రూ.10కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంత రోడ్లను కూడా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలోని చల్లగరిగలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చల్లగరిగ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ లో రూ.10కోట్లతో ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి తరువాత మరిన్ని నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. సుమారు 15వందల మంది స్టూడెంట్స్ ఈ స్కూల్ లో విద్యనభ్యసించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్కూల్ లో ప్రైమరీ విద్య నుండి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉంటుందని, సర్కారు బడిలో చదివే స్టూడెంట్స్ కు మాత్రమే ఈ స్కూల్ లో చదివే అవకాశం ఉంటుంది కాబట్టి, అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని విజ్ఞప్తి చేశారు. చల్లగరిగలో ఏర్పాటు కానున్న పబ్లిక్ స్కూల్ కు అనుకూలంగా ఈ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిద్దుతామని తెలిపారు. చల్లగరిగలో సీసీ రోడ్లు నిర్మించి, బస్టాండ్ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చల్లగరిగ నుండి కొత్తపేట వరకు డబుల్ రోడ్డు మంజూరైందని, స్థానికంగా ప్రస్తుతం రూ.56 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని చెప్పారు. దీంతో పాటు మిగతా నాలుగు రోడ్లకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.గ్రామంలోని రామాలయంకు ఇటీవలె దేవాదాయ శాఖ నుండి రూ.10లక్షలు మంజూరు చేయడం జరిగిందని, టూరిజం శాఖ నుండి మరో కూడా రూ.1 కోటి రూపాయలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపెల్లి జంపయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి తిరుపతి రెడ్డి, గూట్ల తిరుపతి, ముకిరాల మధువంశికృష్ణ, కట్కూరి నరేందర్, బుర్ర శ్రీనివాస్, నల్ల రాజిరెడ్డి, ఆకుల సుధాకర్, దూదిపాల బుచ్చిరెడ్డి, మేరుగు సంపత్ కుమార్, ఎంపీడీఓ, తహశీల్దార్, స్థానిక వార్డు సభ్యులు, పంచాయితీ కార్యదర్శి మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



