ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి

ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు అందె అశోక్
చేర్యాల మండల వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సక్సెస్
చేర్యాల (జనంసాక్షి) జులై 10 : ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అందె అశోక్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుమేరకు శుక్రవారం చేర్యాల మండల వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను తరగతులు బహిష్కరించారు. ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోలేదు. విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల్ని వెంటనే అందజేయాలన్నారు. 16 వస్తువులతో కూడిన కిట్స్ అందించాలన్నారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను అందుబాటులోకి తేవాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రేషలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాల విలీనం పాఠశాలలను తగ్గింపు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహించి తక్షణమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కారం చేసి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పోరండ్ల చందు, కరెడ్ల రంజిత్ రెడ్డి, ఎండీ. అజీమద్ధిన్, వెంకట్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.



