తెలంగాణ సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలి

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి టీపీఏ వినతి
హయత్ నగర్, జూలై 10 (జనం సాక్షి) తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ ( టి పి ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా. ఎన్. వెంకటేశ్వర్లు నాయకత్వం లోని సైకాలజిస్టులు, వైద్య నిపుణులు, విద్యావేత్తల ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో మంత్రిని కలిసి ఈ వినతిపత్రాన్ని అందజేసింది. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పీ. నడ్డా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఈఎఫ్ఎల్యూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. నాగరాజు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అనురాధ జొన్నలగడ్డ తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సైకాలజిస్టులకు చట్టబద్ధమైన గుర్తింపు, రిజిస్ట్రేషన్, వృత్తి నియంత్రణ, నైతిక ప్రమాణాల పరిరక్షణతో పాటు ప్రజలకు నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయడం అత్యవసరమని వివరించింది. వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పీ. నడ్డా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రతినిధి బృందంలో పద్మశ్రీ డా. పి. హనుమంతరావు, డా. ధనశ్రీ నాయుడు, డా. తులసి రావు ( ఐ ఎఫ్ ఎస్), డా. మార్కండేయులు, డా. శాంతన్, డా. రాజు (సీఈఓ, తారా హాస్పిటల్స్), డా. శ్రీనాథ్ పేటల్, డా. శృతి, డా. జ్యోత్స్న, డా. కొడాటి విజయలక్ష్మి, డా. కె.ఎల్. నారాయణరావు, ప్రొఫెసర్ డా. రామస్వామి తదితరులు పాల్గొన్నారు.డా. ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సేవల విస్తరణకు, సైకాలజిస్టుల వృత్తిపరమైన గుర్తింపుకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు కీలకమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు డా. మోటుకూరి రామచందర్ ఈ ప్రయత్నాన్ని సైకాలజిస్టుల వృత్తి చరిత్రలో ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణిస్తూ, అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.



