వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష యం తెలిసిందే. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది ఆయేషాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయేషాకు సాయం చేయాలన్న ఓ మంచి ఉద్దేశంతో ‘జనంసాక్షి’ తొలి అడుగు వేసింది. మీరూ ఇందులో భాగస్వాములై, ఆ చిన్నారికి తమవంతు సాయం చేయాలని ‘జనంసాక్షి’ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నది. అవయవాలన్నీ బాగు న్నా, ఎందరో చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, ఆయేషా తనకున్న వైకల్యాన్ని లెక్క చేయక ఆత్మవి శ్వాసంతో ముందుకు సాగుతోంది. చదువులో ప్రతిభ కనపరుస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయేషాకు పోలియో వ్యాధి కారణంగా రెండు చేతులు, ఒక కాలు సరిగా పని చేయవు. అయినా, అమె ఏమాత్రం కుంగిపోలేదు. రెండు చేతులు లేకున్నా కాళ్లతో పరీక్షలు రాస్తూ పదో తరగతిలో 529 మార్కులు సాధించింది. ఇంటర్మీడియ ట్‌లో కూడా ప్రథమ శ్రేణి ఫలితాలను సాధించింది. ఆయేషా కంప్యూటర్‌ శిక్షణ తీసుకుని కాళ్లతోనే కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడం ఓ అద్భుతం. ఆయేషా తండ్రి సలీముద్దీన్‌ ఇప్పటి వరకు తనకు శక్తికి మించి కృషి చేసి, తన కూతురిని ప్రోత్సహించాడు. కానీ, ఆయేషాది పేద కుటుంబం కావడం వల్ల ఆ తండ్రి కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు. ఉన్నత చదువులు చదవాలని కోరిక ఆయేషాకు ఉన్నా తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని సలీముద్దీన్‌ తెలిపాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాడు. అందుకే, నిబద్ధత గల ఓ విద్యార్థికి చదువు దూరం కాకూడదన్న లక్ష్యంతో ‘జనంసాక్షి’ ఆయేషాకు సాయం చేయాలని కోరుతున్నది. మీలో సాయం చేయాలనుకునే వారు 0878-2245990, 2246990 నెంబర్లలో సంప్రదించగలరు. దాతల పేర్లు తెలిపితే ‘జనంసాక్షి’లో ప్రచురించి గౌరవిస్తాం. గోదావరిఖని నుంచి ఎం. అశ్విత గాంధీ, రూ.500, తాళ్ల సంపత్‌ రూ.500 విరాళాలు పంపించారు.