వోజ్నియాకీకి షాక్ – సెరెనా , వీనస్ ముందంజ
రెండో రౌండ్‌లో జొకోవిచ్ , రాడిక్ , సోంగా
న్యూయార్క్, ఆగస్టు 29: యుఎస్ ఓపెన్‌లో రెండో రోజు సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్ వన్ కరోలినా వోజ్నియాకీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన వోజ్నియాకీకి రొమోనియా క్రీడాకారిణి బెకు షాకిచ్చింది. 6-2 , 6-2 తేడాతో డెన్మార్క్ బ్యూటీపై సంచలనం విజయం సాధించింది. అట ఇటలీ బ్యూటీ ఫ్రాన్సిస్ షివోన్ కూడా తొలి రౌండ్‌లోనే నిష్కమ్రించింది. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ స్టీఫెన్స్ 6-3 , 6-4 తేడాతో షివోన్‌పై గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌లలో మాత్రం సీడెడ్ ప్లేయర్స్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో అమెరికా నల్లకలువ వీనస్ విలియమ్స్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. అన్‌సీడెడ్‌గా ఆడుతోన్న వీనస్ తొలి మ్యాచ్‌లో 6-3 , 6-1 స్కోర్‌తో తన దేశానికే చెందిన మాటెక్ సాండ్స్‌పై గెలిచింది. అలాగే సెరెనా విలియమ్స్ కూడా యుఎస్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ సెరెనా 6-1 , 6-1 తేడాతో అమెరికాకే చెందిన వాండ్‌విగర్‌పై ఈజీ విక్టరీ కొట్టింది. ఇక రెండో సీడ్ రడ్‌వాన్‌స్కా 6-1 , 6-1 స్కోర్‌తో రష్యా ప్లేయర్ బ్రతిచ్‌కోవాపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ అనా ఇవనోవిచ్ 6-3 , 6-2 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి స్విటోలినాపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. వీరితో పాటు కెర్బర్ , సారా ఇరానీ , పుచుకోవా , జంకోవిచ్ , వెస్నినా కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ స్టార్ నోవక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్ తొలి రౌండ్‌లో 6-1 , 6-0 , 6-1 తేడాతో ఇటలీ ఆటగాడు లొరెంజీపై విజయం సాధించాడు. అలాగే అమెరికా ప్లేయర్ 20వ సీడ్ ఆండీ రాడిక్ 6-3 , 6-4 , 6-4 స్కోర్‌తో తన దేశానికే చెందిన విలియమ్స్‌పై గెలిచాడు. అటు ఐదో సీడ్‌గా ఆడుతోన్న ఫ్రాన్స్ సంచలనం సోంగా 6-3 , 6-1 , 7-6 తేడాతో స్లొవేకియా క్రీడాకారుడు బెక్‌పై నెగ్గాడు. వీరితో పాటు థామస్ బెర్డిచ్ , శామ్ క్వారీ , స్టాన్లిస్ వావ్‌రింకా , బాగ్ధైటిస్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు.