వ్యాక్సిన్‌ల పంపిణీకి కమిటీల ఏర్పాటు
హైదరాబాద్,డిసెంబరు 12 (జనంసాక్షి):తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసింది. కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, రైల్వే, రక్షణ విభాగంతో పాటు ఇతరులు కూడా సభ్యులుగా ఉంటారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ముందుగానే ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన డాటా బేస్ సిద్ధం చేయడం, వ్యవస్థను ఏర్పాటు చేయడం, వసతులు, ఆర్థిక పరమైన ఏర్పాట్లు తదితరాలను స్టీరింగ్ కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి టాస్స్‌ఫోర్సు వ్యాక్సిన్ కోసం ఏర్పాట్లు, పంపిణీని పర్యవేక్షించాలి. టైమ్ లైన్లు నిర్ధారించుకొని అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలి. అదే తరహాలో కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్, ఎంపీడీఓ నేతృత్వంలోని మండల టాస్క్ ఫోర్స్ పనిచేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సహాయంతో వ్యాక్సిన్ పంపిణీ సరైన విధంగా, పటిష్టంగా జరిగేలా చూడాలని… ఇదే సందర్భంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు