శాంతికి భంగం వాటిల్లకుండా ఉత్సవాలు
వినాయక మండళ్ల వివరాలు తప్పనిసరి
ఆదిలాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి): వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి పొందాలని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. గణెళిశ్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీసులుసూచించారు. గణెళిశ్ మండళ్ల నిర్వాహకుల పేర్లు, ఫోన్ నెంబర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో పొందుపరిచేలా అధికారులు చూడాలన్నారు. మండళ్లవద్ద కాపలాకాసే పోలీసులకు నిర్వాహకులు సహకరించాలన్నారు.అలాగే అన్ని వివరాలు స్థానిక పోలీసులకు ఇవ్వాలని అన్నారు. సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి, గణెళిశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తే అసాంఘిక ఘటనలకు తావుండదని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు, ఉట్నూర్ ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి అయినందున, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా సమన్వయ కమిటీలను ఏర్పాటుచేసి వాటిద్వారా గొడవలు తలెత్తకుండా అప్రమత్తమవ్వాలని సూచించారు. ఆటంకాలు కలుగజేస్తే, ఎంతటివారైనాసరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని కూడా ఖాతరు చేయరాదని సూచించారు. గణెళిష్ నవరాత్రుల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసుల విధుల నిర్వహణలో అప్రమత్తమే అత్యవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులతో ఇటీవల సమావేశమై తగిన సూచనలు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గణెళిష్ మండపాల కమిటీలు, ఆయా కాలనీల్లోని పెద్దలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను తెలుసుకోవాలన్నారు. శాంతి కమిటీ సభ్యులకు కూడా బాధ్యతలు అప్పగిస్తే ఆటంకాలు తలెత్తే సమస్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.