శాంతియుత ఉద్యమాలను రెచ్చగొడితే..

ప్రతిఘటన పోరాటాలైతయ్‌
కోదండరాంపై కేసు సీమాంధ్ర సర్కారు కుట్ర : పిట్టల రవీందర్‌
కరీంనగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : శాంతి యుత ఉద్యమాలను రెచ్చగొడితేనే ప్రతిఘటన పోరాటాలు మొదలవుతాయని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్‌ పిట్టల రవీందర్‌ అన్నారు. కోదండరాం ఇంటి దాడి, దిష్టిబొమ్మ దహనాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మం గళవారం జిల్లా కేంద్రంలోని ఫిల్మ్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడు తూ ప్రభుత్వం, పాలకులు అవలంబించే విధా నాలు, చేసే కుట్ర వల్లనే ప్రజా ఉద్యమాలకు బీజం పడుతుందని, అలా వచ్చిన తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కోదండరాం పాలకుల ప్రజా వ్యతిరేక వైఖరి వల్లే ఆక్రోశంగా మాట్లాడారని అన్నారు. కోదండరాం మంత్రి శ్రీధర్‌బాబుపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, కుట్ర పూరితంగా కేసులు పెట్టారన్నారు. శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మ దహనం చేయాలని ప్రయత్నించినందుకే నాడు ఆయన అనుచరులు నిరసనకారులపై దాడులు చేయగా, పోలీసులు కేసులు పెట్టారు.. మరి మొన్న కోదండరాం దిష్టిబొమ్మను కూడా శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.. వీళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పాలకులు అవలం బిస్తున్న ఇలాంటి ప్రజాస్వామిక చర్యల వల్లనే కోదండరాం లాంటి వాళ్లు గొంతెత్తి నిలదీసి, ఆవేదనతో మాట్లాడుతున్నారని చెప్పారు. నాటి మహబూబాబాద్‌ సంఘటనైన, బాబు యాత్రలో చోటు చేసుకున్న అపశ్రుతులైనా పాలకుల నిర్లక్ష్య చర్యల వల్లనే జరుగుతాయని రవీందర్‌ వివరించారు. కరీంనగర్‌ కవాతు విజయవంతం అయిందన్న అక్కసు, తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవాలనే ఇలాంటి కుట్ర పూరిత చర్యలకు ప్రభుత్వం పూనుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఏనాటి నుంచో చితకబాదుతూ కేసులు పెడుతున్నా, శ్రీధర్‌బాబు కనీసం స్పందించలేదని ఆరోపించారు. ఇప్పుడు ఆయనను రెండు మాటలనే సరికి కేసులు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు