శ్రీనివాసన్‌పై బిగిస్తున్న ఉచ్చు

రాజీనామాకు పలువురి డిమాండ్‌
బీసీసీఐకి జగ్దలే రాజీనామా
ముంబై, మే 31 (జనంసాక్షి) :
ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ అడ్డంగా ఇరుక్కోవడంతో ఇప్పుడు ఆయన పదవికే ఎసరు వచ్చింది. శ్రీనివాసన్‌ తప్పుకోవాల్సిందేనని బీసీసీఐ కార్యవర్గం హెచ్చరించింది. ఆయన రాజీనామా చేయాలనే ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని శ్రీనివాసన్‌ చెబుతుంటే, రాజీనామా చేయాల్సిందేనని బోర్డు సభ్యులు స్పష్టం చేస్తున్నారు. నిన్నటి వరకూ తన కుర్చీపై ధీమాగా ఉన్న బీసీసీఐ చీఫ్‌కు వ్యతిరేక స్వరం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతానికి తనకున్న మద్దతుదారులలో కొందరు వ్యతిరేకమైపోవడంతో శ్రీనివాసన్‌కు కూడా టెన్షన్‌ మొదలైనట్టు సమాచారం. వెంటనే అత్యవసర ఏజీఎం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని పలువురు సభ్యులు బాహాటంగానే డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు, హిమాచాల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అనురాగ్‌ ఠాకూర్‌ కూడా శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా స్వరం పెంటారు. బోర్డ్‌ ప్రెసిడెంట్‌ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. శ్రీనివాసన్‌ తప్పుకోకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన బీసీసీఐ కోశాధికారి అజయ్‌ షిర్కే శుక్రవారం సాయంత్రం అన్నంత పనిచేశారు. బీసీసీఐ సెక్రటరీ జనరల్‌ సంజయ్‌ జగ్దలే పదవి నుంచి తప్పుకున్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీనివాసన్‌ రాజీనామా చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు.