శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ పథకంతో ఇక నీళ్లేనీళ్లు

వేయికోట్లు మంజూరు చేశాం ..కాళేశ్వరంతో నీటిని నింపుతాం

జీవన్‌ రెడ్డిని మరోమారు గెలిపించాలి

కాంగ్రెస్‌ను గెలిపిస్తే కరెంట్‌ ఎటమటం అవుతుంది

ఆర్మూర్‌ సభలో సిఎం కెసిఆర్‌ హెచ్చరిక

నిజామాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): శ్రీరాం సాగర్‌ పునర్జీవ పథకానికి… కాళేశ్వరం ద్వారా నీళ్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాంమని, దీంతో ఎస్సారెస్పీ ఎప్పుడూ ఎండిపోదని సిఎం కెసిఆర్‌ అన్నారు. పునర్జీవ పథకానికి 1000 కోట్లు మంజూరు చేశాం. ఆ పనులు పూర్తయితే.. ప్రాజెక్ట్‌ ఇక జన్మలో ఎండిపోదు. మేలో కూడా నిండే ఉంటదని.. ఎస్సారెస్పీతో ముందుగా నీళ్లొచ్చేది ఆర్మూర్‌ ప్రజలకే అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సభకు మంత్రి పోచారం, ఎంపీ కవిత, సురేశ్‌రెడ్డి, ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరెంట్‌ వస్తుంది.. నీళ్లు వస్తయి.. నీళ్ల కోసం ఉన్న వనరులను, వసతులను చాలా తెలివిగా, ఒడుపుగా ఉపయోగించుకుంటున్నాం అని వివరించారు.

ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో విూకు తెలుసంటూ ఆర్మూర్‌ చైతన్యవంతమైన ప్రాంతం. విూరంతా ఆగమాగం కావద్దు. ఆలోచన చేయండి. వాస్తవేంది.. నిజమేందని ఆలోచన చేయండి. ప్రజలు వాస్తవాల పైపు, నిజాల వైపు, పని చేసేవాళ్లవైపు ఉంటే మంచి జరుగుతది.. లేకపోతే చెడు జరుగుతదని అన్నారు. . ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్‌ పాలన, 17 ఏళ్లు తెలుగుదేశం పాలన నడిచింది. ఈ నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌లో ఏం జరిగిందో విూకు తెలుసు. ఎవరు ఏం చెప్పినా విూ ఊళ్లో చర్చించండి. వాళ్ల పాలనలో అభివృద్ధి ఎలా ఉంది.. అప్పుడు కరెంట్‌ ఎట్లా వచ్చేది.. ఇప్పుడు ఎట్లా వస్తుంది. ఆశా వర్కుర్లు, అంగన్‌వాడీలకు అప్పుడు జీతాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు జీతాలు ఎలా ఉన్నాయి.. అని ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. భారతదేశంలోనే రైతాంగానికి ఫ్రీగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. యాదవులకోసం, గౌడలో కోసం, చేనేత కార్మికు లకోసం ఏవిధమైన పునర్జీవ కార్యక్రమాలు జరుగుతున్నాయో విూకు తెలుసు. చెట్ల పన్ను రద్దు చేశాం. సంక్షేమంలో నెంబర్‌ వన్‌. పేదింటి ఆడపిల్ల

పెళ్లికి ప్రభుత్వం లక్షా 116 ఇస్తదని ఎన్నడన్నా అనుకున్నమా? కంటివెలుగు ఎన్నడన్నా ఊహించినమా? బీడీ కార్మికులు ఆర్మూర్‌లో కూడా దండిగా ఉన్నారు. ఎవరన్నా పట్టించుకున్నరా బీడీ కార్మికులను. అందరితో పాటుగా బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తున్నామని అన్నారు. కడుపు కట్టుకొని కుంభకోణాలు, లంబకోణాలు లేకుండా పనిచేసినం కాబట్టి సంపద పెరిగింది. ఆ పెరిగిన సంపదను ప్రజలకు పంచుతున్నాం. పింఛన్‌దారులందరికీ కొత్త ప్రభుత్వం వచ్చాక 2016 రూపాయలు చెల్లిస్తాం. వికలాంకులకు 3016, నిరుద్యోగ భృతి 3016 ఇస్తాం. రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేలు ఇస్తామన్నారు.

పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నామని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో ఒక్క రూపాయి అప్పు లేదు. లబ్దిదారులను జిల్లా కలెక్టర్లే ఎంపిక చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కాదు. అంతా పారదర్శకంగా ఉంటుంది. సొంత జాగా ఉన్న వాళ్లకు కూడా డబుల్‌ బెడ్‌రూం పథకం విస్తరింపజేస్తం.. అని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. కొన్ని పార్టీలు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. ఈ సభలో రెండు లక్షల రుణం ఉన్నవాళ్లు ఉన్నారా? ఎవరూ ఉండరు. పేదలకు రెండు లక్షల రుణం ఉంటదా? ఎవరో ధనవంతులు అంత రుణం తీసుకుంటరు. ఇదివరకు లక్ష రుణమాఫీ చేశాం. మళ్లీ చేస్తాం. రైతులు బాగుంటేనే.. దేశం బాగుంటదన్నారు. ఉద్యోగ సోదరులు ఆలోచించాలి. కన్ఫ్యూజ్‌ కావొద్దు. కొన్ని పార్టీలు వాళ్లను కన్ఫ్యూజ్‌ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. ఏ విధంగా ఉద్యోగ ఫ్రెండ్లీ ఉందో విూ అందరికీ తెలుసు. కొంతమంది మిమ్మల్ని పెడదారి పట్టిస్తున్నారు. ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాలి. అందరికీ ఐఆర్‌, ఫిట్‌మెంట్‌ ఇస్తాం. పదవి విరమణ వయసు పెంచే విషయంపై కూడా ఆలోచిస్తున్నాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జీవన్‌ రెడ్డిని మరొకసారి ఆదరించి.. భారీ మెజార్టీతో గెలిపించండి. కాంగ్రెసోళ్లు నిశ్శబ్ద విప్లవం వస్తది అంటున్నారు.. నేను ఆశ్చర్యానికి గురవుతున్నా. చాలా నియోజకవర్గాల్లో చూశా.. నిర్మల్‌లో 80 వేలకు పైగా వచ్చారు. బోధ్‌లో 50 వేలు, ఖానాపూర్‌లో 60 వేలు, ఆర్మూర్‌లోనూ భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆర్మూర్‌ ఉద్యమంలోనూ మొదటిస్థానంలో ఉన్నది. జిల్లాలో 9 స్థానాలు గెలుస్తాం. ఇది శబ్ద విప్లవం. సురేశ్‌రెడ్డి కూడా అభివృద్ధి కోసం పార్టీలోకి వచ్చారు. వారికి కూడా ఉన్నత స్థానం కల్పించబడుతుంది. అందరం కలిసి అద్భుతమైన రాష్ట్రంగా చేసుకోవాలని అన్నారు. నేను చావునోట్లే తలకాయ పెట్టిన. వలస పాలన నుంచి విముక్తి కావాలని ఉద్యమం చేసినం. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ..69 లో మా రాష్ట్రం మాకు కావాలంటే పిట్లలను కాల్చినట్టు 400 మందిని కాల్చారు. తర్వాత కూడా పొత్తు పెట్టుకొని నట్టేట ముంచారు. ఈరోజు కేసీఆర్‌ను ఢీకొనే శక్తి లేక ఆంధ్రాకు పోయి బాబును పట్టుకొచ్చారు. ఈ చంద్రబాబు పెత్తనం అవసరముందా మనకు అని అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే గ్యారెంటీగా కరెంట్‌ ఎటమటం అయితదని హెచ్చరించారు.