శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయండి

పార్లమెంట్‌లో తమిళ ఎంపీల డిమాండ్‌
మౌనం దాల్చిన కేంద్రం
ఎంపీల వాకౌట్‌, గాంధీ విగ్రహం ఎదుట ధర్నా
న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) :
ఐక్యరాజ్య సమితి భద్రతా సమావేశాల్లో శ్రీలంఖకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తమిళనాడుకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్‌లో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీలంఖ సర్కారు, సైన్యం తమిళులపై జరిపే అకృత్యాలు, ఊచకోతను తాము వ్యతిరేకిస్తున్నామని, అయితే ఈ వ్యవహారంలో పెద్దన్న పాత్ర పోషించబోమంటూ కేంద్రం సమాధానమిచ్చింది. దీంతో సంతృప్తి చెందని ఎంపీలు కేంద్రం శ్రీలంఖను వ్యతిరేకించి తీరాల్సిందేనని పట్టుబట్టారు. అయితే స్పష్టమైన హామీ రాకపోవడంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ డీఎంకే, అన్నా డీఎంకే తదితర పార్టీలకు చెందిన ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేసి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం నో ఫైరింగ్‌ జోన్‌లోనూ అమాయక తమిళులపై కాల్పులకు తెగబడుతున్నా భారత్‌ చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. శ్రీలంఖ అకృత్యాలను యావత్‌ ప్రపంచం ఖండిస్తున్నా మన సోదరుల కోసం ఏమీ చేయలేమా అంటూ ప్రశ్నించారు. కేంద్రం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని తమిళుల రక్షణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.