శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి
ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
తిరుమల, సెప్టెంబర్ 9 (జనంసాక్షి):
శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తరించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 6.25 నిమిషాలకు ఆలయ ముఖ ద్వారంగుండా లోపలికి ప్రవేశించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తో పాటు కుటుంబ సభ్యులైన కోడలు చిత్రలేఖ ముఖర్జి, మనవడు చాణక్ ముఖర్జి ఉన్నారు. క్షేత్ర సంప్రదాయానికి అనుగుణంగా రాష్ట్రపతి ముందుగా శ్రీవరహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయానికి బయలుదేరారు. టీటీడీ ఈఓ ఎల్వీసుబ్రహ్మణ్యం, చైర్మన్ కనుమూరి బాపిరాజు, పాలక మండలి సభ్యులు, అధికా రులు, అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతికి ఇస్తికాఫల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం శ్రీరంగనాయక మండ పంలో ప్రణబ్‌ముఖర్జీకి వేదపండితులు ఆశీర్వచ నాలు అందజేశారు.రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు ఉన్నారు. అంతకుముందు శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతికి స్థానిక పద్మావతి అతిథి గృహాల వద్ద టీటీడీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.
రాత్రి విశ్రాంతి తీసుకున్న రాష్ట్రపతి ఆదివారం ఉదయం పద్మావతి అతిథి గృహాల నుంచి వాహనాల కాన్వాయ్‌లో ఆలయ సమీపలోని మహాద్వారం వరకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాటరీ వాహనంలో రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకుని పుణ్య జలాన్ని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం క్షేత్ర స్థాయి ప్రకారం భూ వరహ స్వామిని దర్శించుకున్నారు. బ్యాటరీ కారులో ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ మర్యాదల ప్రకారం ఇస్తికాఫల్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించిన రాష్ట్రపతికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలకగా, ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం చైర్మన్ కనుమూరి బాపిరాజు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి 8.15 నిమిషాలకు, పద్మావతి అతిథి గృహానికి చేరుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజ్, అనంతపురం రేంజ్ డీఐజీ చానుసిన్హా తదితరులతో అల్పాహారం తీసుకున్నారు. 10.25 నిమిషాలకు నూతనంగా నిర్మించిన నందకం అతిథి భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. అక్కడ బోర్డు సభ్యులను చైర్మన్ పరిచయం చేయించారు. 11 గంటలకు వేద పాఠశాలను సందర్శించిన రాష్ట్రపతి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురి విద్యార్థులకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గల్లా అరుణకుమారి, పార్థసారథి, ఎంపీ చింతా మోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, చంగారెడ్డి, తిరుమల జేఈఓలు శ్రీనివాసరాజు, వెంకట్రామిరెడ్డి, ఆలయ ముఖ్య భద్రతా అధికారి అశోక్‌కుమార్, ఎస్పీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 12.20 నిమిషాలకు తిరుమల నుంచి తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి న్యూఢిల్లికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.