శ్రీ చైతన్య, నారాయణలు విద్యను వ్యాపారం చేశాయి

అందిన కాడికి దోచుకుంటున్నాయి
ఈటెల ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) :
శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు చదువును వ్యాపారం చేశాయని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ మండపడ్డారు. తల్లిదండ్రుల బలహీనత ఆధారంగా కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నాయని ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ శ్రీచైతన్య, నారాయణ కళాశాలల్లో విద్యార్థులకు ఒకే తరహా బోధన ఉండడం లేదని ఆరోపించారు. విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశాలకు ముందు తర్వాత యాజమాన్యాల ధోరణి భిన్నంగా ఉందని విమర్శించారు. సామాన్యుడికి కార్పొరేట్‌ విద్య అందని ద్రాక్షగానే నిలుస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారన్నారు. సామాన్యుడి ఇంట్లో ఉన్నబంగారం, ఆస్తులు అమ్ముకున్నా కూడా ఇంటర్మీడియెట్‌ చదివించలేకపోతున్నారని ఆరోపించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వంతపాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రస్తుత విద్యావ్యవస్థే సామాన్యుల పాలిట శాపంగా మారిందన్నారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే వారికి రెండు శాతంసీట్లు కూడా లభించడం లేదన్నారు. ఎంసెట్‌, ఐఐటి, ఈసెట్‌ ఆసెట్‌ అంటూ విద్యార్థుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాయన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడిని అరికట్టడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం అవుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు పందులకు ఆవాసాలుగా మారుతున్నాయన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన పోషకాహరం అందడం లేదన్నారు. మెస్‌చార్జీలు, హాస్టల్‌లో విద్యార్థులకిస్తున్న మొత్తాన్ని పెరిగినదరలకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు చదువుతో వ్యాపారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించకపోవడం వల్ల ప్రైవేట్‌ విద్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయన్నారు. తెలంగాణాలో కళాశాలలు, పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు.ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడాతో విద్యాసంస్థలు పనిచేస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థుల్లో కూడా  సమానబావన తగ్గిపోయిందన్నారు. విద్య వైద్యం పూర్తి ఉచితంగా అందించాలని ఈటెల డిమాండ్‌ చేశారు.