శ్వేత జాతి కండకావరం
బీరు టిన్‌లపై జాతి పితా చిత్రం
మద్య నిషేధ సమాజాన్ని కోరుకున్న మహాత్ముని మరో మారు హత్య
మల్టినేషన్ కంపెనీల తీరును ముక్త కంఠంతో ఖండిద్దాం.
‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
శ్వేతజాతీయులు కండకావరాన్ని ప్రదర్శించారు. ప్రపంచానికి పెద్దన్నగా ఫోజులు కొడుతూ స్వేఛ్చా, స్వతంత్రాల గురించి మాట్లాడే అమెరికా వంద కోట్ల మంది భారతీయులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహాత్మగాంధీ అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది. మనసులను గాయపరిచింది. మహాత్ముడు తాను బతికున్న కాలంలో మద్యరహిత సమాజం కోసం కల్లు మానండోయ్.. కళ్లు తెరవండోయ్ అంటూ నినదించాడు. అదే స్ఫూర్తి భారతరాజ్యంగ ఆర్టికల్ 47లో మద్య వ్యతిరేక ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టాలని చేర్చడమైంది. ఇన్ని ప్రయత్నాలు చేసిన చివరకు భారత జాతిపితనే అవమానపరుస్తూ అమెరికా కేంద్రంగా ఉన్న న్యూ ఇంగ్లాడ్ బ్రూయింగ్ కంపెనీ యావత్ భారతజాతి మనోభావాన్నే దెబ్బతీస్తూ బీరు సీసాలపై జాతిపిత బొమ్మను ముద్రించి చీప్ పబ్లిసిటీ ట్రిక్‌ను ప్రదర్శించింది.
హైదరాబాద్,జనవరి7(జనంసాక్షి) : బీరు సీసాలపై గాంధీ బొమ్మను ముద్రించి అమెరికా లోని న్యూఇంగ్లండ్ బ్రూయింగ్ కంపెనీ గాంధీజీ ప్రతిష్టను హత్య చేసింది.భౌతికంగా నాధూరామ్ గాడ్సే ఆనాడు గాంధీని హత్య చేస్తే ఇప్పుడు ఈ విదేశీ కంపెనీ గాంధీ ఆత్మను హత్య చేసింది. మానవ హక్కుల కోసం దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు న్యాయవాదిగా పోరాటం సాగించి 1915 జనవరి 9న భారత దేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ తన జీవితాంతం భారత దేశ స్వాతంత్య్ర సముపార్జన కోసం బ్రిటిష్‌పాలకులతో పోరాటం సాగించారు. అహింసే సాధనంగా మద్యపాన నిషేధం, విదేశీ వస్తు బహిష్కరణ, వంటి మహదాశయాలతో యావద్భారత ప్రజలకు స్ఫూర్తి కలిగించి ముందుకు నడిపించారు. గాంధీ పోరాటానికి బ్రిటిష్ తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. కేవలం చెప్పడమే కాకుండా ఆచరించి చూపించడంలో ఆయన అవలంబించిన దృఢసంకల్పం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంతటి మహనీయుని బొమ్మతో చౌకబారుగా బీరు వ్యాపారం సాగించడం ఘోరాతిఘోరం. విదేశీ బ్రూవరీస్ కండ్లకావరం. ఈ సంస్థ నిర్వాకానికి దేశాలు తప్పున పడుతున్నాయి. భారతీయుల్లో అగ్ని గుండం రగులుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో చేసేదిలేక న్యూ ఇంగ్లండ్ బ్రూయింగ్ కంపెనీ కాళ్ల బేరానికి వచ్చింది. తాము నాణ్యమైన సాటిలేని మద్యం ఉత్పత్తి చేస్తున్నందుకు కృతజ్ఞతగా గాంధీ బొమ్మ సీసాలపై చిత్రించామని సమర్ధించుకోవడం ఎంత అపహాస్యం. అంతేకాక మహాత్ముని రూపాన్ని ఒక రోబోలా చిత్రించింది. దీన్ని బట్టి గాంధీజీపై ఎంత నిర్లక్ష్యం వహించిందో స్పష్టమవుతుంది. పైగా ఆబీరు సువాసనలు వెదజల్లుతుందట. శాకాహారం కిందకు వస్తుందట. సత్యం, ప్రేమ కాంక్షించేందుకు వీలుగా ఆత్మపరిశుద్ధికి ఇది సహకరించే ఆదర్శ మా ర్గంగా ఆ కంపెనీ కబుర్లు చెబుతోంది. కానీ భారత దేశ ప్రజలు ఎవరూ ఈ కల్లబొల్లి కబుర్లు నమ్మరు. ఆ కంపెనీపై ఎలాంటి సానుభూతి చూపించరు. గాంధీ చిత్రాన్ని దుర్వినియోగం చేసి భారత చట్టానికి వ్యతిరేకంగా ఆ సంస్థ వ్యవహరించినందుకు కఠినంగా శిక్షించాలని ఒక న్యాయవాది కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్సు టు నేషనల్ హానర్ యాక్టు) నిబంధనలను ఆ అమెరికా కంపెనీ ఉల్లంఘించిందని న్యాయవాది వాదించారు. జనవరి 3న న్యూఇంగ్లాండ్ బ్రూయింగ్ కంపెనీ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక సమాచారాన్ని పోస్టు చేసింది. ‘గాంధీ-బోట్’ నేరంగా భారతీయులెవరైనా భావించి మనస్తాపం చెందితే తమ సంస్థ క్షమాపణలు చెబుతుందని వివరణ ఇచ్చింది. ఎవరినీ అగౌరవ పర్చడం తమ ఉద్దేశం కాదని అత్యంత గౌరవాభిమానాలున్న మహాత్మునికి తాము నివాళి అర్పిస్తున్నామని ఆ సంస్థ భక్తి శ్రద్ధలున్నట్టు నటించింది. ఇకనుంచి మద్యం ఉత్పత్తిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఈ విధంగా మళ్లీ ఎలాంటి దుర్వినియోగం కాకుండా చూస్తామని మద్యం గురించి మహాత్ముడు ఏం చెప్పారో అది తాము గుర్తు చేసుకుంటామని వివరించింది. ఇంతగా వివరిస్తున్న ఆ సంస్థ అంతఘోరంగా ఎందుకలా ప్రవర్తించిందో అర్దం కాదు. గాంధీజీ మద్యపానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇది సమాజానికి తీరని చెడు పరిణామంగా ఆయన భావించారు. న్యూ ఇంగ్లాండ్ బ్రూయింగ్ కంపెనీ ఉత్పత్తి చేసే ఈ మద్యానికి గాందీ-బోట్ అని పేరు పెట్టింది. అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ మద్యం కానుకను ఆదరిస్తున్నారని ఆ కంపెనీ చెప్పింది. అంతేకాదు గాంధీ మనుమడు మనుమరాలు కూడా ఈ బీరును చూసి ప్రశంసించారని నమ్మ బలికింది. అయితే టెలిగ్రాఫ్ దిన పత్రిక కధనంలో గాంధీ సంబంధీకులు చాలామంది తీవ్ర నిరసనలు తెలియచేసినట్టు పేర్కొంది. గాంధీ పేరు లేదా బొమ్మను బీరు సీసాలపై ముద్రించే ముందు ఆ సంస్థ తమ కుటుంబాన్ని అసలు సంప్రదించలేదని గాంధీ పెద్దమనుమడు తుషార్ గాంధీ వెల్లడించారు. ఆ కంపెనీ ఈ విధంగా భారతీయులందరినీ అవమాన పరిచిందనీ చట్టపరమైన చర్యకు సిద్ధమవుతున్నామని ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఆల్కహాలంటే గాంధీకి విపరీతమైన అసహ్యం. అలాంటప్పుడు గాంధీ బోధనలు తెలుసునని చెప్పుకుంటున్న ఆ సంస్థ ఆల్కహాలు బాటిల్‌పై గాంధీ చిత్రం ఎలా ముద్రిస్తారు ? గాంధీజీ తన జీవితమంతా మద్యపాన నిషేధంపై పోరుతోనే సాగింది. ఎక్కడైనాసరే మద్యపాన నిషేధం గురించే ఎక్కువగా మాట్లాడేవారు. గాంధీ మరో మనుమడు గోపీకృష్ణ గాంధీ ఈ నిర్వాకంపై మాట్లాడుతూ బీరుసీసాలపై బాపూజీ చిత్రాలను ముద్రించడం బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. గాంధీ కీర్తికి కళంకం కలిగించేలా నిర్లక్ష్యం చూపించారని విమర్శించారు. ఆ కంపెనీ ఫేస్‌బుక్ ద్వారా క్షమాపణలు ప్రకటించినప్పటికీ దాదాపు కొన్ని వందల విమర్శలు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని చిన్న విషయంగా భారత ప్రభుత్వం చూసీచూడనట్టు ఊరుకోరాదు. చట్టపరంగా ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలి. అంతేకాక పార్లమెంటులో దీనిపై తీర్మానం చేయాలి. ఈ ఘోరం మరేసంస్థ చేయకుండా కట్టుబాటు చేయాలి. బాపూజీకి జరిగిన అవమానం యావద్భారతానికి జరిగినట్టే. దీనిపై ఉద్యమాలు, ఆందోళనలు సాగిస్తే కానీ ఈ వికృత చేష్టలకు అడ్డుకట్ట పడదు.