శ్వేత విప్లవ పితామహుడు
వర్గీస్ కురియన్ ఇక లేరు
అహ్మదాబాద్, సెప్టెంబర్ 9 (జనంసాక్షి):
శ్వేత విప్లన పితామహుడు వర్గీస్‌కురియన్ (90) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కురియన్ నడియాడ్‌లోని ఓ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మోల్లి, కుమార్తె నిర్మలా కురియన్, మనవడు సిద్ధార్థ ఉన్నారు. 1921 నవంబర్ 26న కేరళలోని ప్రస్తుత కోజికోడ్ ఒకప్పటి బ్రిటీష్ ఇండియాలో మద్రాసు ప్రెసిడెన్సీలోని క్యాలికట్‌లో జన్మించారు. ఆయన తండ్రి కొచ్చిన్‌లో సివిల్ సర్జిన్‌గా పనిచేశారు. ఆయన 1940లో మద్రాసులోని లయోల కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో పట్టభద్రుడయ్యాడు. గిండి ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీ రింగ్‌లో బీఈ చేశారు. అనంతరం టాటా స్టీల్ సంస్థలో చేరారు. ప్రభుత్వ స్కాలర్ షిప్‌పై ఆయన అమెరికాలోని మెథిగాన్ స్ట్రేట్ యూనివర్సిటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ సాధించారు. 1949 మే 13న గుజరాత్‌లోని ఆనంద్‌లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. అప్పటి నుంచి ఆయన డెయిరీ అభివృద్ధిపై విజయవంతంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఆనంద్‌లో అముల్ ఫ్యాక్టరీ ఆవిష్కరణకు విచ్చేసిన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాడి పరిశ్రమ అభివృద్ధిలో కురియన్ చేసిన కృషికి ముగ్ధుడై ఆయనను గాఢాలింగనం చేసుకున్నారు. అముల్ తరహా సహకార పరిశ్రమ ఎంతో విజయవం తమైంది. 1965లో అప్పటి ప్రధాని లాల్‌బహ దూర్ శాస్త్రీ ఈ కృషిని దేశ వ్యాప్తం చేసేందుకు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి కురియన్‌ను చైర్మన్‌గా నియమించారు. ఆ తరువాత డెయిరీ ఉత్పత్తులను విరివిగా అమ్మ కాలు జరిగేలా కురియన్ జీసీఎంఎంఎఫ్‌ను 1973లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అముల్ ఉత్పత్తులను దేశంలోనే కాక, విదేశాలలో కూడా విరివిగా అమ్మకాలు సాగించింది. 2006లో ఆ సంస్థ యాజమాన్యంతో పొసగకపోవడంతో కురియన్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. కురియన్ సేవలకు 1999లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.