షా

(గత బుధవారం తరువాయి భాగం)
ఆకుర్రవాడు చేతులు కట్టుకుని వినమ్రంగా మేష్టారి ముందు విద్యార్థిలా సమాధానాలిచ్చాడు.అర్థమైపోయింది.స్కూల్‌లో చేర్పిస్తా మని ఆ కుర్రాడిని తీసుకొచ్చినట్టుంది.ఆ తల్లి.అదుపు తప్పిన కుర్రవాడిలా లేడు.రాముడిలా,బుద్ధిమంతుడిలా ఉన్నాడు.బాల్యం ఇంకా వాడి చెంపలమీదినుంచి జారిపోలేదు.వాడి బాల్యాన్ని నాలుగ్గోడల మధ్య బంధించాలనిపించలేదు.వాడిని అబ్జర్వేషన్‌ హోమ్‌కి పంపించడానికి మనస్కరించలేదు.అది అన్యాయంగా ,దుర్మార్గంగా తోచింది.తల్లిని విచారించాలని కూడా అనిపించలేదు.నాకు అనిపించిన విషయాల్ని ఆ ఫిటీషన్‌పై రాసి ఆ ఫిటీషన్ని డిస్మిస్‌ చేశాను.ఆ సంగతి తల్లికి చెప్పాను.ఆమెకి అర్థం కాలేదు.న్యాయవాది వైపు చూసింది.అతను ఆమె దగ్గరకు వెళ్లి వివరించాడు.ఆమె నిరుత్సాహంగా ,నిస్సహాయంగా వెళ్లిపోయింది.కుర్రవాడు నిరుత్సాహంగానే ఆమె వెంట నడిచాడు.ఒక మంచి పని చేశాననిపించింది.నా ఉద్యోగం తృప్తినిచ్చింది.వాడి బాల్యాన్ని నియంత్రించనందుకు ఆనందం వేసింది.
పది రోజులు గిర్రున తిరిగాయి సాయంత్రం ఆరు కావొ స్తుంది.బెంచి అప్పుడే దిగాను.సంతకాలు పెడుతూ ఛాంబర్‌లో కూర్చున్నాను.అటెండర్‌ ఓ కవర్‌ను టేబిల్‌పైన ఉంచాడు.
”ఏమిటది”అనడిగాను .
”సీసీఎస్‌ వాళ్ల రిమాండ్‌ సార్‌ ”
పోలీసులకిదో అలవాటు .ఐదు గంటల్లోపే రిమాండ్‌ తీసుకురమ్మని ఎన్ని సార్లు చెప్పినా ఫలితం ఉండదు.ఐదున్నరకి ,ఆరు గంటలకి రిమాండ్‌ తీసుకొస్తారు .అరెస్టు చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే ముద్దాయిలను హాజరు పరుస్తారా అంటే అదీ లేదు.వాళ్ల ఇష్టం వచ్చినన్ని రోజుల వాళ్ల దగ్గర ఉంచుకుని కోర్టుకు తెచ్చే తేదీతో అరెస్టు తేదీ,టైమూ సరి చూసుకుని కోర్టుకు తెస్తారు.అందుకే రిమాండ్‌ రిపోర్టులలో కొట్టివేతలు ,తుడిపి వేతలు.


రిపోర్టు తీసి చదివాను.ముద్దాయి బాల నేరస్తుడు.బస్టాండులో బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి జేబులోంచి పర్సు కొట్టేయబోయి దొరికినాడు ,రెడ్‌ హ్యాండెడ్‌గా .అందుకని దర్యాప్తు పూర్తయ్యేవరకు అబ్జర్వేషన్‌ హోమ్‌ పంపించమని కోరుతూ రిపోర్టు సారాంశం.
ప్రథమ సమాచార నివేదికతో బాటు రిమాండు రిపోర్టు తీసుకుర మ్మని బెంచీ క్లర్కుకి ఇచ్చాను.కొద్ది సేపటి తరువాత హాల్లోకి వచ్చాను .అప్పటికే బెంచ్‌ క్లర్క్‌ రెండింటితో తయారు.సరి చూశా ను.సరిగ్గా ఉన్నాయి.అటెండర్‌ సీసీఎస్‌ పోలీసులని పిలిచాడు.
కుర్రాడిని కోర్టులో నిలబెట్టారు పోలీసులు.
”ఏం పేరు?” రిపోర్టు చూస్తునే అడిగాను
”నాగరాజు”
”తండ్రి పేరేమిటి?”
”ముని సుబ్రమణ్యం”
”ఎంత వయస్సు?”
”ఎనిమిది సంవత్సరాలు”
”ఏ ఊరు?”
”కరకంబడి”
”పోలీసులేమైనా కొట్టారా?”
”లేదు”
”ఏమైనా చెప్పుకొంటావా?”
”ఏమిలేదు”
ఆ కుర్రవాడు చెప్పిన వివరాలు రిమాండ్‌ రిపోర్టు వివరాలతో సరిపోయాయి.రిమాండు రాయబోతూ ఆ కుర్రవాణ్ణి ఓ సారి తేరిపార చూశాను .
ఎక్కడో చేసిన గుర్తు .లీలగా ఏదో జ్ఞాపకం. గుర్తొచ్చింది. పది రోజుల క్రితం తల్లితో పాటు జువేనైల్‌ కోర్టుకి అతను రావడం గుర్తుకొచ్చింది.వినయంగా ,వినమ్రంగా ఆ రోజు జవాబులు చెప్పిన కుర్రవాడు ,అమాయకత్వాన్ని కళ్లలో నింపుకుని నా ముందు ఆరోజు నిల్చున్న కుర్రవాడు దొంగతనం చేయడానికి ప్రయత్నిం చాడంటే నమ్మబుద్ది కావడం లేదు.ఎందుకిట్ల జరిగింది?ఏదో జరిగి ంది.ఏదో తెలియని బాధ! వాడిని అబ్జర్వేషన్‌ హోమ్‌కి పంపి ంచడానికి మనష్కరించలేదు.ఆ రోజే పంపించినా బాగు ండేదేమో!అట్లా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనిపించింది.
”మీ అమ్మ వచ్చిందా?”
”వచ్చింది”
బయటి వైపు చూశాను.చెట్టుకింద వాడి తల్లి .ఆమెలో ఎలాంటి చలనం లేదు.ఎలాంటి అదుర్థా కనపడ లేదు. మొన్నటి కన్నా ఇంకా చిక్కిపోయినట్టుగా అనిపిం చింది. కరువుకి ప్రతిరూపంలా ఆమె.
”మీ అమ్మ జామీను ఇస్తే నిన్ను విడుదల చేస్తాను .నువ్వు ఇంటికి వెళ్లి పోవచ్చును మీ అమ్మను పిలువు ”అన్నాను .
”ఇంటికొద్దండి ,నన్ను స్కూలుకే పంపండి ”
”ఇట్లా ఎందుకు చేశావు- తప్పుకాదా?”
”తమరారోజు నన్ను స్కూల్లో చేర్చుకొమ్మంటే చేర్చుకోలేదు. నాకు తండ్రి లేడు.నన్ను చదివించే స్తోమత మా అమ్మకి లేదు.పెంచే స్తోమత అంతకన్నా లేదు.చదువుకోవాలన్న కోరిక నాకుంది.”
”అయితే మాత్రం ఇట్టా చేస్తావా?”
”ఇట్లా చేస్తె తప్ప మీరు అక్కడికి పంపించరని మా అమ్మకి పెద్దాయన చెప్పాడు.అందుకే ఇట్లా చేశాను సార్‌ ”
అంతే !నా తల గిర్రున తిరిగిపోయింది.నేనేమనుకున్నాను .ఎట్టా జరిగింది!వాడి బాల్యాన్ని నాలుగ్గోడల మధ్య బందించకూడదనుకున్నాను .కాని ఎలాంటి మలుపు తిరిగిం ది.!నా చేతులు కట్టి వేయబడ్డాయి.నా ముందున్న న్యాయశాస్త్ర గ్రంథాల్లోని అన్ని ద్వారాలు మూసివేయబ డ్డాయి.వేరే దారి లేదు .వాడిని అబ్జర్వేషన్‌ హోమ్‌ కి పంపించమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం మినహా మరో గత్యంతరం లేదు నాకు .
రిమాండు రిపోర్టుపై ఆ ఉత్తర్వులు రాసి లేచి ఛాంబరులోని వాలు కుర్చీలో జారగిల్లి పోయ్యాను.ఖాళీ కడుపులో నీళ్లు పోయినట్టు ఒకటే బాధ!