షేక్‌ సాలెహ్‌ ట్రస్ట్‌ సేవలు అమూల్యం

– డీఆర్‌వో బీఆర్‌ ప్రసాద్‌
కరీంనగర్‌, జూలై 10 (జనంసాక్షి) : కరీంనగర్‌ జిల్లాలో షేక్‌ సాలెహ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు అమూల్యమని డీఆర్‌వో బీఆర్‌ ప్రసాద్‌ కొనియాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మానేర్‌ గార్డెన్‌లో జరిగిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ 28 ఏళ్లుగా షేక్‌ సాలెహ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కేవలం పాఠ్య పుస్తకాలనే పంపిణీ చేస్తుండగా, ట్రస్ట్‌ వాటితోపాటు నోటు పుస్తకాలను అందించడం గొప్ప విషయమన్నారు. పేద విద్యార్థులకు తమ వంతు చేయూతను అందిస్తున్న ట్రస్ట్‌ డీఆర్‌వో అభినందించారు. అనంతరం డీఆర్‌వో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు గతంలో తమ సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ కళాశాలను నడిపించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని మూసి వేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తరుపున నాలుగెకరాల స్థలాన్ని మంజూరు చేయిస్తే, మళ్లీ ఐటీఐని పునరుద్ధరిస్తామని డీఆర్‌వోకు విన్నవించారు. దీనిపై స్పందించిన బీఆర్‌ ప్రసాద్‌ ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని ట్రస్ట్‌ సభ్యులకు హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ హాజరు కావాల్సి ఉండగా, ఇతర కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. ఆమె బదులు డీఆర్‌వో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షుడు మహ్మద్‌ ముజఫ్ఫరుద్దీన్‌, ఉపాధ్యక్షులు మహ్మద్‌ అఖ్తర్‌ అలీ, జాయింట్‌ సెక్రెటరీ జహూర్‌ ఖాలిద్‌, జనరల్‌ సెక్రెటరీ సలీముద్దీన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ షేక్‌ అబూబకర్‌ ఖాలిద్‌, ట్రస్టీలు సయ్యద్‌ జుబేర్‌ అహ్మద్‌, సర్వర్‌ షా బియాబానీ, షేక్‌ ఇస్హాఖ్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.