సంక్షేమ పథకాలను బలంగా ప్రచారం చేయాలి: గుత్తా

నల్లగొండ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచాలని ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి  అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు తదితర పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించా లని, ఆ బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లాల వారీగా ఏర్పాటైన బూత్‌కమిటీ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ గుర్తు కారు గుర్తును విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికల అనంతరం పట్టాదారు పాస్‌ పుస్తకాలను ప్రతిఒక్కరికీ అందజేయడం జరుగు తుందని, అవి అందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి కూడా త్వరలోనే వాటిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త, నాయకులు బేధాభిప్రాయాలు పక్కనపెట్టి సమష్టిగా ఉమ్మడి  జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషిచేసి విజయానికి సహకరించాలన్నారు.