‘సంసద్‌’తో మన సత్తా చాటాలి

చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరించిన కోదండరామ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) :
సంసద్‌ యాత్రతో తెలంగాణ ప్రజల సత్తా యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి చాటి చెప్పాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన నగరంలో సంసద్‌యాత్ర, చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మాట్లా డుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ప్రజాస్వా మిక పోరాటాలు సాగిస్తున్నా పాలకపక్షాలు అణచివేసేందుకు ప్రయత్ని స్తున్నాయని తెలిపారు. అణచివేత ద్వారా ఉద్యమాన్ని ఎంతగా తొక్కిపెట్టాలని  చూసినా అంతే స్థాయిలో ఎగసిన చరిత్ర తెలంగాణ పోరాటానికి ఉందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికే తెలంగాణ ప్రజలు అంగీకరించలేదని, బలవంతంగా ఆంధ్రతో కలిపి ప్రజల ఆత్మగౌరవాన్ని హరించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. 1969లో ఆత్మగౌరవం కోసం, ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, వనరుల తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వారిపై తూటాలు పేల్చి పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్‌ తర్వాతి కాలంలో అదే తీరును కొనసాగిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు జాగురూకం కావాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాల కాంగ్రెస్‌ చరిత్ర తెలంగాణకు వ్యతిరేకమేనని, 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి తర్వాత కోల్డ్‌స్టోరేజీలో పెట్టింది అదే పార్టీయేనన్నారు. ఎన్నోసార్లు అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుందని, ఇకపై ఆ పార్టీ మోసపూరిత వైఖరిని అంగీకరించబోమన్నారు. తెలంగాణలోని పది జిల్లాల ప్రజలు సంసద్‌ యాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈనెల 29, 30 తేదీల్లో హస్తిన మొత్తం తెలంగాణ నినాదాలతో మార్మోగాలని సూచించారు. సంసద్‌యాత్రతో తెలంగాణలోని ద్రోహులకు, తెలంగాణకు అడ్డం పడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు చాటిచెప్పాలన్నారు.

తాజావార్తలు