సడక్ స్తంభించాలే..
జనమంతా రోడ్లపైకి రావాలి
ఢిల్లీ దిమ్మదిరగాలే
కేంద్రం దిగిరావాలే
బస్సుయాత్రలో కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలు తఢాకా చూపాలె.. సడక్ స్తంభించాలె.. రోడ్లన్నీ జనంతో నిండిపోవాలే.. జనగర్జనను చూసి ఢిల్లీ దిమ్మతిరగాలే… కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇవ్వాలే అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం సడక్ బంద్‌కు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణవాదం లేదంటూ తప్పుడు ప్రచారం చేసే సీమాంధ్ర పెట్టుబడిదారీ శక్తులు, వారి అడుగులకు మడుగులొత్తే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల గుండెలు దద్దరిల్లేలా జనసందోహం పోటెత్తాలని పిలుపునిచ్చారు. రెండ్రోజుల పాటు సాగే యాత్ర హైదరాబాద్-కర్నూలు మధ్య రహదారి వెంట ఉన్న గ్రామాల మీదుగా సాగుతుందని తెలిపారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి కోదండరామ్ బస్సు యాత్రను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి వల్లే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, మరింత జాప్యం చేస్తే యువత భావోద్వేగాలకు లోనయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. టీ మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఇకపై తమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే రీతిలో ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు కనువిప్పు కలిగించేందుకే ఈ యాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులను చూసి బుద్ధి తెచ్చుకొనైనా తెలంగాణ కోసం ఐక్యం కావాలని సూచించారు. సమరదీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాద్దాంతం చేసిన తెలంగాణ మంత్రులు… లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు తెలంగాణ వ్యతిరేకంగా చేస్తున్న మాటలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. వారి వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించే వరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. సడక్‌బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో ముందుకు రావాలని సూచించారు. లేకుంటే, వారి నియోజకవర్గాల్లో తెలంగాణ ద్రోహులుగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి ఆలంపూర్ వరకు ఉన్న సుమారు 170 కిలోమీటర్ల బెంగళూరు హైవేను దిగ్బంధించాలని కోరారు.