సత్యాగ్రహం నేరమట! ఇరోం షర్మిలపై ఆత్మహత్యాయత్నం కేసు

న్యూ ఢిల్లీ ,మార్చి 3 (జనంసాక్షి) :
వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్‌ షర్మిలపై సోమవారం ఢిల్లీలోని ఓ కోర్టు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసింది. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద 2006 అక్టోబర్‌ 4న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై ఈ అభియోగాలు  మోపింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 22వ తేదీకి వాయిదా వేసింది. తనది అహింసా పోరాటమని, సత్యాగ్రహం నేరమెలా అవుతుందని షర్మిల ప్రాసిక్యూషన్‌ ఆరోపణలు తోసిపుచ్చింది. దీంతో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆకాశ్‌జైన్‌ ఆమెపై అభియోగాలు మోపారు.
కోర్టు బయట ఓ వైపు నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఇరోమ్‌ షర్మిల మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరయ్యారు. తాను ఆత్మహత్య చేసుకోవడం లేదని, తనది అహింసా మార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. తనకు న్యాయం, శాంతి కావాలని కోరారు. ఆమె మద్దతు దారులు కోర్టు బయట ఆందోళన చేపట్టారు.