సమష్టికృషి.. కర్ణాటక విజయం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ
న్యూఢిల్లీ,మే8(జనంసాక్షి) :
కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తంచేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు. కర్నాటకలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి ఆమె అభినందనలు తెలిపారు. అలాగే కాంగ్రెస్‌కు ఓటేసి ఆదరించినందుకు ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందసి/-తామని అన్నారు. ఇది విలక్షణమైన తీర్పు అన్నారు. ఈ విజయం కాంగ్రెస్‌కు ఎంతో బలిమినిచ్చిందని పేర్కొన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ విజయంలో రాహుల్‌ కీలక పాత్ర పోషిచారని రాష్ట్ర నాయకులు అన్నారు. ఈ విజయంలో పార్టీ యువనేత రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషించారని ప్రధాని  ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలో గెలుపుబాటలో ముఖ్యపాత్ర పోషించిన రాహుల్‌ గాంధీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంతో ఆట ముగిసిందని  కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. బిజెపి  అసలు రంగును ప్రజలు గ్రహించి తిరస్కరించారని ఆయనన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించారు ప్రజలు వాస్తవాలను గుర్తించి కర్ణాటకలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. ఈ విజయంతో తమకు మరింత బలం వచ్చిందన్నారు.ఈ ఎన్నికలల్లో మోడీ ప్రభావం లేదని సందేశం వెల్లడయిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014ఎన్నికలపై కర్ణాటక ప్రభావం ఉంటుందన్నారు.  కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ హర్షం వ్యక్తంచేశారు.రానున్న సాధారణ ఎన్నికల్లోనూ బిజెపికి  మూడో స్థానం తప్పదని ఎద్దేవా చేశారు.కర్ణాటక ఎన్నికల్లో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ మంత్రం పనిచేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రభావం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.     కాంగ్రెస్‌ విధానాలకు ప్రజలు మద్దతు ఇచ్చారని కాంగ్రెస్‌ అధికారప్రతినిధి జనార్దన్‌ ద్వివేది అన్నారు.తమ విధానాలకు ప్రజలు మద్దతు ఇవ్వడంతోనే కర్ణాటకలో విజయం సాధించామని ఆయన అన్నారు. కర్ణాటకలో బిజెపి అవినీతి పాలనతో ఓటమిపాలయిందని ఆయన అన్నారు. ప్రత్యామ్యాయం లేకపోవడంతో కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు.  కర్ణాటక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభావం లేదని ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి  తన తప్పదాలతోనే కర్ణాటకలో అధికారం కోల్పోయిందని ఆయన విశ్లేషించారు.