సమస్యలతో… ఇరుకైన ‘ఖని’ కాలనీలు

సౌకర్యాలు కరువు తి పట్టించుకోని అధికారులు
కోల్‌సిటి, జులై 11, (జనం సాక్షి) గోదావరిఖనిలోని రాంనగర్‌, సంజయ్‌నగర్‌, జ్యోతినగర్‌ ప్రజలు పరిష్కారం కానీ సమస్యలతో… సతమతమవుతున్నారు. తమ సమస్యల గురించి… ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్‌ అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్న సమస్యకు పరిష్కారం లభించ కపోగా… రోజురోజుకు సమస్యలు జఠిలమవుతున్నాయి. వందలాది కుటుంబాలు ఇబ్బడిముబ్బడిగా రూపొందిన ఇళ్లల్లో నివాసముండగా… ఈ కాలనీల్లోని దాదాపుగా అన్ని సంధుల్లో అపరిశుభ్రత ప్రళయతాండవం చేస్తున్నది. ఈ వాడల్లో డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో… మురికినీటి సర ఫరా రోడ్లపైనే ప్రవహిస్తోంది. దుర్వాసనను వెదజల్లుతోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలు పెరిగిపోయి కాలనీవాసులకు రోగాలను తెచ్చిపెడుతున్నాయి. ఇక రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడో వేసిన రోడ్లను అప్పుడప్పుడు రకరకాల పేరిట త్రవ్వకాలు జరపడంతో… నడిరోడ్డుపైన గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులకు, బాటసారుల రాకపోకలకు అనేక ఇబ్బందులు ఏర్పడు తున్నాయి. చాలాచోట్ల అసలు రోడ్డే లేకపోవడంతో… మరిన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే… తాగునీటి సమస్య ఈ మూడు కాలనీల ప్రజలు ఎదుర్కుంటున్నారు. ఉన్నటువంటి నీటి కుళాయిల్లో మూడు రోజుల కొకమారు నీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల్లో వచ్చే నీరు కలుషితంగా ఉంటోం ది. వాడాకానికి కూడా… నీరు కరువైంది. రామాలయం వెనక ప్రాంతంలో ఉన్న కాలనీలో అసలు నీటి కుళాయిలు లేకపోగా, బోరింగ్‌లు సైతం అధికారులు ఏర్పాటు చేయలేదు. పారిశుద్ధ్య పనులు కార్పొరేషన్‌ అధికారులు సక్రమంగా నిర్వహించకపోవడంతో… చెత్తా చెదారం రోడ్లపైనే కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయి. ఆద్యాంతం నెలకొన్న ఈ సమస్యలను పరిష్కరించాలని… ఈ కాలనీల ప్రజలు చేసిన ఆందోళనలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రాంతంలో బడా నాయకులుగా… పేరొంది న చాలామంది ఈ మూడు కాలనీల వాస్తవ్యులుగా ఉన్నప్పటికి… సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. వార్డుల కార్యనిర్వహణను చూసే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే సమ స్యలు తిష్టవేశాయి. అధికారులు కూడా… పట్టించుకోవడం లేదు. సమస్యలను పరిష్కరించాలనే… చిత్తశుద్ది కరువైంది. ప్రజల ఆగ్రహానికి గురికాక ముందే కాలనీలోని సమస్యలను మాయం చేయాలి అని ఉల్లంగుల రమేష్‌ అన్నారు.