సమాజంలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి
అఖిల భారత మహిళ సంఘం (ఐద్వా) సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
పానుగల్ అక్టోబర్ 09, జనంసాక్షి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు హక్కులు కల్పించాలని అఖిల భారత మహిళాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో అఖిల భారత మహిళా సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి మల్లు లక్ష్మి హాజరై మాట్లాడారు. మహిళలను వంచనకు గురి చేసే విధంగా ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా బెల్టు షాపులను ఏర్పాటు చేయడం పురుషులను తాగుబోతులుగా మార్చడం ఆపైన గృహహింస కుటుంబ మానసిక వేదనలకు కారణాలవుతున్నాయని పాలకులను విమర్శించారు.మహిళలపై నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలతోపాటు అన్ని రంగాలలో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయిలీల,లక్ష్మి జిల్లా నాయకులు రాణి,మంజుల,ఆకాశవేణి, కవిత,పద్మ,ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.