సమైక్యాంధ్ర ఎవరు కోరుకుంటున్నరు?
సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఆ ముసుగును తొలగించి రాజకీయ రంగు పులుముకున్న నేతలు, వారి అధీనంలో ఉన్న మీడియా ఉదయం నుంచి రాత్రి వరకు సాగించే అబద్ధపు ప్రచారం సమైక్యాంధ్ర. రాష్ట్రంలోని అత్యధికులు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని వారు ప్రతినిత్యం అబద్ధాలు వళ్లించుకుంటూ పోతారు. లగడపాటి లాంటి వారైతే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని జోక్‌గా మార్చేశారు. అయినా పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు వీళ్లు మాత్రమే కోరుకునే సమైక్యాంధ్రను అక్కడి ప్రజలంతా కోరుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రాంత నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొళ్లగొట్టి కోటీశ్వరులుగా మారిన వీరి లక్ష్యం.. గమ్యం ఒక్కటే హైదరాబాద్. ఆ నగరం చుట్టూ వాళ్లు అక్రమంగా పోగేసుకున్న ఆస్తుల పరిరక్షణ. అవకాశం ఉన్న ప్రతి చోట దోపిడీ చేయడం. తెలంగాణ ఏర్పడితే వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని భయం. దీంతోనే లేని సమైక్యవాదాన్ని తెరపైకి తెస్తున్నారు. చూడండి ఎంతమంది సమైక్యాంధ్ర కోరుకుంటున్నారో అని సీమాంధ్ర ప్రాంత ప్రజలందరినీ లెక్క చూపుతున్నారు. నిజానికి వారంతా సమైక్యాంధ్ర కోరుకుంటున్నారా? అంటే ఎవరికి గొంతు పెగలదు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు, అక్కడి నుంచి ఉపాధిని వెదుక్కుంటూ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వలస వచ్చిన వారెవరూ సమైక్యాంధ్ర కోరుకోవడం లేదు. సీమాంధ్ర ప్రజలు ఆ పేరుతో జరిపిన పోరాటాలూ లేవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు 2009లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన రోజున వారు పెద్దగా స్పందించలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఈ పెట్టుబడిదారీ శక్తులైన ప్రజాప్రతినిధులు కుమ్మక్కై పార్టీల అడ్డుగోడలను దాటుకుని స్పీకర్ ఎదుట నిలబడి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వారు అంతటితోనే ఆగకుండా తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందని హైదరాబాద్‌లో వివిధ పనులు చేసుకొని బతికే వారిని బలవంతంగా వెళ్లగొడతారని, సీమాంధ్ర ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు కూడా దొరకవనే అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఆందోళన చెందిన ఎస్‌కేయూ, ఏయూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి చిన్నపాటి ఆందోళనలు చేశారు. దీంతో తమ పుట్టిమునుగుతుందని భావించిన ఈ నేతలు ఆ ప్రాంతంలో డబ్బు సంచులు కుమ్మరించి పోటీ ఉద్యమాన్ని ఏదో చేశాం అనే స్థాయిలో జరిపించారు. వారి చెప్పుచేతల్లో ఉన్న మీడియా దాన్ని చిలువలు పలువలు చేసి చూపింది. సీమాంధ్ర ప్రాంతంలో ఏదో జరిగిపోతుంది అనే భావన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కలిగేలా చేసింది. సీమాంధ్రులకు స్వతహాగా అలవడిన లాబీయింగ్‌ను ఢిల్లీలో జోరుగా ప్రయోగించి కొందరిని తమ దారిలోకి తెచ్చుకున్నారు. వారి ద్వారా తెరచాటు వ్యవహారాలు చక్కబెట్టడంతో కేంద్రం ఇచ్చిన మాటను వెనక్కు తీసుకుంది. దీనిని నిరసిస్తూ ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా తెలంగాణ యువత ఆత్మ బలిదానాలకు పాల్పడింది. అయినా కేంద్రం నుంచి ఇసుమంతైనా స్పందన లేదు. ప్రజలంతా రోడ్లపైకి ఉద్యమించినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సకల జనుల సమ్మె చేసినా దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిందే తప్ప ప్రజల ఆకాంక్షను గుర్తించి సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదు. 2009 డిసెంబర్ 10 నుంచి 22 వరకు మినహా సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం జరిగింది లేదు. అయినా కేంద్రం సమస్య పరిష్కారానికి లేషమంతైనా చర్యలు తీసుకోలేదు. ప్రతిసారి తెలంగాణ అంశం చాలా సున్నితమైన సమస్య అని చెప్పడం మినహా ఎంత సున్నితమైంది? సున్నితమైన సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో చూసే ప్రయత్నమూ చేయలేదు. కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు. ఇక్కడ నివసించే ఒక్కరంటే ఒక్కరు కూడా తాము సమైక్యాంధ్రలో కలిసి ఉంటామని చెప్పరు.. చెప్పబోరు. తెలంగాణవాదం ఈ రోజో.. నిన్ననో పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు. నాలుగు దశాబ్దాలుగా రగులుతున్న నిప్పు కణిక. తెలంగాణపై ప్రకటన వచ్చిన తర్వాత అడ్డంగా మాట్లాడిన చంద్రబాబును ఇక్కడి ప్రజలు ప్రశ్నించని సందర్భం లేదు. వేలాది మంది పోలీసులను రక్షణ పెట్టుకొని తెలంగాణలో అడుగుపెట్టినా లాఠీ దెబ్బలకు వెరువకుండా తెలంగాణ ప్రజ బాబును నిలదీసింది. ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చావు దెబ్బతీశారు. వస్తున్న మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆయన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చే వరకు బాబును తెలంగాణ ప్రజలు వెంటాడుతూనే ఉన్నారు. కానీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబును సీమాంధ్ర ప్రాంతంలో ఇదేమిటని అడిగిన వారే కరువయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి పురిటిగడ్డగా లగడపాటిలాంటి వ్యక్తులు చెప్పుకునే విజయవాడ గడ్డమీద కూడా బాబుకు అక్కడి ప్రజలు బ్రహ్మరథమే పట్టారు. లగడపాటి రాజగోపాల్ ఒక్కడే బాబును నిలదీస్తానని బయలుదేరి రెండు రోజుల పాటు జోకర్ వేశాలేసి అభాసుపాలయ్యాడు. ఆ సందర్భంలో కాని ఆ తర్వాత కాని బాబును అడ్డుకోవడానికి ఎవరూ ఉత్సాహం చూపలేదు. అదే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, సీమాంధ్ర ప్రజల పేరిట పెట్టుబడిదారులు చెప్పుకునే కృత్రిమ వాదానికి తేడా. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తే, సమైక్యాంధ్రనే కోరుకుంటే బాబు ఆ ప్రాంతంలో యాత్ర కొనసాగించేవాడు కాదు. తెలంగాణ ప్రజల్లో ఉన్నంతగా వారిలో కలిసి ఉండాలనే కాంక్ష ఉంటే ఎందుకు రాష్ట్రం విడగొట్టమన్నావంటూ ఎక్కడికక్కడ నిలదీసేవారు. ఊళ్లన్ని ఆయనకు అడ్డుగా నిలిచేవి. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. బాబును అభిమానించే వారు, ఇంతదూరం నడుచుకుంటూ వస్తున్నాడు కదా చూసొద్దాం పదా అనే ధోరణిలో మరికొందరు వెళ్లి ఆయనకు బాసటగా నిలుస్తున్నారే తప్ప ఎవరూ కనీసం నిరసన కూడా తెలుపలేదు. దీన్ని ఒక్క సీమాంధ్ర మీడియా చానెల్, వారి నేతృత్వంలో వెలువడుతున్న పత్రికలు కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. అదే గోరంత ఉద్యమాన్ని కొండంతలు చేసి లేని ఉద్యమాన్ని ఉన్నట్టుగా చూపి వచ్చిన తెలంగాణను అడ్డుకున్నాయి. ఇప్పుడు ఆ పెట్టుబడిదారీ శక్తులు.. ఆ మీడియానే చెప్పాలి సమైక్యాంధ్ర ఎవరు కోరుకుంటున్నారో అని.