సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం

 ఊపందుకుంటున్న జై ఆంధ్రా ఉద్యమం : వసంత నాగేశ్వరరావు
జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకున్న పోలీసులు
నందిగామాలో ఉద్రిక్తత
నందిగామాసెప్టెంబర్‌ 14 (జనంసాక్షి):
కృష్ణా జిల్లా నందిగామలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జై ఆంధ్ర బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సభకు అనుమతి లేదని చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన నేతలను, స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని భారీ ర్యాలీగా సభకు వస్తున్న జై ఆంధ్రఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వరరావును మధ్యలోనే అడ్డుకున్నారు. అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వసంతనాగేశ్వరరావు పోలీసులపై, సమైక్యవాదులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిన లగడపాటి లాంటి వారే జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరుపుతామన్నారు. సమైక్యవాదులకు దమ్ముంటే సభను అడ్డుకోవాలని సవాలు విసిరారు. ప్రశాంతంగా చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కొందరు సమైక్యాంధ్ర నేతలు కావాలనే తనను అరెస్టు చేయించారని దుయ్యబట్టారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సమైక్యాంధ్ర పేరిట కృత్రిమ ఉద్యమం సృష్టించారని వసంత నాగేశ్వరరావు విమర్శించారు. ‘సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం. దాన్ని కొందరు కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు పెంచి పోషిస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే బాగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. రెండు ప్రాంతాలుగా విడిపోతే తప్పేవిూ లేదని, సోదరుల్లాగా కలిసి బతకవచ్చన్నారు. రెండు ప్రాంతాలు పోటాపోటీగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మరోవైపు, వసంత నాగేశ్వరరావు అరెస్టును నిరసిస్తూ.. జైఆంధ్ర ఉద్యమ కార్యకర్తలు నందిగామ జాతీయ రహదారిపై బైఠాయించారు. సమైక్యవాదులకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్వహించి తీరతామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో సభ జరిగే పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, నేషనల్‌ హైవే రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.