సమైక్య రాష్ట్రంలో ముస్లింలకు భారీ నష్టం

1

ఆంగ్ల విద్య లేక ముస్లింల వెనుకబాటు

ఉర్దూను మింగేసిన ఇంగ్లీష్‌ భాష

ఇది ముమ్మాటికీ సీమాంధ్రుల పాపమే..

ముస్లింలకు ఆంగ్ల యూనివర్శిటీ తక్షణావసరం

చట్టసభలకు దూరమవుతున్న ముస్లిం ప్రజాప్రతినిధులు

జిల్లాల నుంచి ప్రాతినిద్యం కరువు

పంక్షర్‌, బడీకొట్లకే పరిమితమవుతున్న ముస్లిం విద్యార్థులు

రిజర్వేషన్ల అమలూ అంతంతమాత్రమే

సచార్‌ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి

తెలంగాణ ముస్లింల వెనుకబాటుపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో.. భిన్న సంస్కృతులు, మతాలకు చిహ్నం..! అందులో ఒకరు ముస్లింలు..!! కానీ.. అందరితోపాటు ముస్లింలు అభివృద్ధి చెందడం లేదు..! అందరినీ పాలించేది ఒకే ప్రభుత్వం..!! మరి.. ఎందుకీ తారతమ్యం..? ముస్లింల వెనుకబాటుకు కారకులెవరు..? ఆ పాపం ఎవరిది..? వారి అభివృద్ధికి అడ్డుపడుతున్న అవరోధాలేమిటి..? వారిపట్ల ప్రభుత్వాలు చూపుతున్న వివక్ష ఏంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు యావత్‌ తెెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో… ముస్లింల వెనుకబాటుకు కారణాలు, పరిష్కారాలను సూచిస్తూ.. ‘జనంసాక్షి’ దినపత్రిక ప్రత్యేక కథనం అందిస్తోంది.

సీమాంధ్ర కుట్రలకు ఉర్దూ హాంఫట్‌…

తెలంగాణలో నైజాం పాలన అనంతరం తెలంగాణలో ఆంధ్రా విలీనమైంది. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వలసవాదులు తెలంగాణలో తిష్టవేశారు. క్రమంగా తెలంగాణపై పట్టుసాధించేందుకు గాను కుట్రలు చేశారు. అందుకు తెలంగాణలో అధికార భాషగా ఉన్న ఉర్దూను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. పాలనాపరంగా, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ, న్యాయస్థానాల్లోనూ ఇంగ్లీషును వాడుకలోకి తెచ్చారు. తద్వారా ఉర్దూను బలహీనపర్చారు. దీంతో.. అప్పటి వరకు అన్ని న్యాయస్థానాల్లో ఉర్దూభాషలో అనర్గళంగా కేసులను వాదించిన ముస్లింలు ఆంగ్లభాష రాని కారణంగా వెనక్కి తగ్గారు. ఇలా కోర్టుల్లో, వివిధ ప్రభుత్వ శాఖల్లో ముస్లింల ఉద్యోగాలు పోవడానికి ఆంగ్లభాష ప్రభావం చూపింది. అంతిమంగా ఉర్దూ భాషనేదే లేకుండా పోయింది. ఫలితంగా.. అన్ని రంగాల్లోనూ ముస్లింల ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అప్పటిదాకా.. అన్ని రంగాల్లో కలిపి 16 శాతంగా ఉన్న ముస్లింల ఉద్యోగాలు ఒక శాతానికి పడిపోయాయి. దీన్నిబట్టి.. ముస్లింల వెనుకబాటుకు ఆంగ్లభాషే ప్రధాన కారణమైందని అర్థమవుతోంది. ఉర్దూ భాష ముస్లింలది కాదు. వారిది అరబ్బి భాష. ఉర్దూ తియ్యటి.. సంస్కారవంతమైన భాష. ఇది ముస్లిం, హిందువులకు సంబంధించిన భాష. కానీ.. సీమాంధ్రులు ఉర్దూను ముస్లింల భాషగా భావించి దాని రూపురేఖలు లేకుండా చేశారు. ఉర్దూలో కవితలు, రచనలు చేసేవారిలో ముస్లింలేకాదు.. హిందువులూ ఉన్నారు. ఉర్దూ భాష అంతంతో ముస్లింలకే కాదు.. ఉర్దూభాషను నమ్ముకున్న హిందువులకూ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.

చట్టసభలకు దూరంగా ముస్లిం ప్రజాప్రతినిధులు…

ఆంగ్లభాషను అభ్యసించేందుకు తెలంగాణలో ముస్లింలకు తగినన్ని అవకాశాలు లేవు. అందుకు సంబంధించిన యూనివర్శిటీలు లేవు. ముస్లింలకు ఆంగ్ల విద్యను నేర్పించాలన్న ఆలోచనా దృక్పథంతో ఇప్పటి వరకు పాలించిన సమైక్య ప్రభుత్వాలు చేయలేదు. ముస్లింలలో ఎక్కడో ఒకరిద్దరు ఆంగ్ల విద్యను అభ్యసించినా వారు తగినంత ప్రగతి సాధించలేదు. మరీముఖ్యంగా రాజకీయాల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు. చట్టాలన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. వాటిని తెలుసుకోవాలంటే ఇంగ్లీషు భాష తప్పనిసరి. కానీ.. ముస్లింలకు ఇంగ్లీషు రాదు. అందువల్ల చట్టాలను అధ్యయనం చేయడంలో ముస్లింలు వెనుకబడిపోయారు. తద్వారా రాజకీయాలకు దూరంగా ఉండి చట్టసభలకు ఎక్కువమంది ముస్లింలు ప్రజాప్రతినిధులు రాలేకపోతున్నారు.

పంక్షర్‌ షాపులు, బడీకొట్లలో ముస్లిం విద్యార్థులు…

ముస్లిం విద్యార్థులు విద్యనభ్యసించేందుకు.. గతంలో ఒక ఉర్దూ భాషనే అందుబాటులో ఉండేది. సీమాంధ్రులు తెలంగాణకు వచ్చాక ఇంగ్లీషు పుణ్యమా అని ఉన్న ఉర్దూభాష నీరుగారిపోయింది. పోనీ వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల భాషను నేర్చుకుందామా అంటే.. అందుకు అవకాశాలు లేకుండా పోయాయి. తద్వారా.. ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. చివరికి నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ తరుణంలో వారి తల్లిదండ్రులకు కుటుంబపోషణ భారమై తమ పిల్లలను ఏదో పనిలో పెడుతున్నారు. దీంతో ముస్లిం విద్యార్థులు చిన్నచిన్న పంక్షర్‌ షాపులు, బడీకొట్లకు పరిమితమవుతున్నారు.

ముస్లింల అభివృద్ధికి సమైక్య పాలకుల చర్యలు శూన్యం…

తెలంగాణలో సీమాంధ్ర పాలన మొదలయ్యాక ముస్లింల అభివృద్ధి నానాటికీ కుంటుపడింది. తక్కువ జనాభా ఉన్న ముస్లింలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకుగాను వారికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ముఖ్యంగా వారు అభివృద్ధి చెందేందుకు కావాల్సిన విద్యావకాశాలను దెబ్బతీశారు. ఉన్న ఉర్దూను తమ స్వార్థం కోసం నాశనం చేసి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టి ముస్లింలను విద్యకు దూరం చేశారు. చట్టసభల్లో వారి అభివృద్ధికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను కూడా సరిగా అమలు చేయలేదు. సంక్షేమ పథకాలను ప్రకటించారు తప్ప ఆచరించలేదు. ప్రభుత్వం నుంచి ముస్లింల అభివృద్ధికి ఎలాంటి సాయమూ చేయలేదు. ముస్లింల అభివృద్ధికి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించినా ఏనాడూ వాటిని పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. ఇలా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముస్లింలకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు, విద్యావకాశాలు ఏవీ వారికి పూర్తిస్థాయిలో అందలేదు.

ఆంగ్ల యూనివర్శిటీ వస్తేనే.. ముస్లింల అభివృద్ధి…

ప్రస్తుతం ఏ చదువు చదవాలన్నా.. ఆంగ్ల విద్య తప్పనిసరైంది. ఇంజనీరింగ్‌ చదవాలన్నా.. న్యాయ విద్యను అభ్యసించాలన్నా.. టెక్నికల్‌ విద్య కావాలన్నా… రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలన్నా… చట్టసభల నిర్ణయాలను తెలుసుకోవాలన్నా… అన్ని అంశాలూ ఇంగ్లీషు భాషలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముస్లింలకు ఆంగ్ల విద్యను అభ్యసించే సౌకర్యాలు, అవకాశాలు ఎక్కడా లేవు. కాబట్టి.. పైన పేర్కొన్న అన్ని అంశాలపై ముస్లింలు అవగాహన పెంచుకోవాలంటే వారికి ఆంగ్ల విద్యనేర్పించడం తప్పని సరి. ఆంగ్ల విద్య రావాలంటే ఆంగ్ల యూనివర్శిటీ అంత్యంత అవసరం. ఆ బాధ్యత ప్రభుత్వానిది. అందుకు ప్రభుత్వం తెలంగాణలో ఆంగ్ల యూనివర్శిటీని ఏర్పాటు చేయాలి.

సచార్‌కమిటీ సిఫార్సులను అమలు చేయాలి…

ముస్లింల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసేందుకు గతంలో నియమించిన సచార్‌కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిటీలు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదికలు రూపొందించాయి. ఆ నివేదికల ప్రకారం.. తెలంగాణ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లోని దళితుల కంటే.. గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసీల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారని పేర్కొంది. వారికి విద్యావకాశాలేకాదు.. ప్రభుత్వం అందిస్తున్న ఏ ఒక్క సాయమూ అందడం లేదు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు వంటి సౌకర్యాలేవీ వారికి దక్కడం లేదు. కనీసం మూడుపూటలా తిండితినలేని దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని సచార్‌కమిటీ తెలిపింది. అందుకు ప్రభుత్వం తక్షణం స్పందించి ముస్లింలకు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించింది. ముస్లింలు ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో ముస్లిం అధికారులను నియమించాలని, ముఖ్యంగా ముస్లిం ఏరియాల్లోని పోలీస్‌స్టేషన్లలో ముగ్గురు అధికారులను నియమిస్తే.. అందులో ఒకరిని ముస్లిం వ్యక్తిని నియమించాలని సూచించింది. కానీ.. అవేవీ అమలు కావడం లేదు.

ముస్లింల అభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ చొరవచూపాలి…

తెలంగాణలో ముస్లింల అభివృద్ధి కోసం.. అన్ని రంగాల్లోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ముందుగా వారికి ఆంగ్ల విద్యను నేర్పించాలి. అందుకు నూతన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ముస్లిం విద్యార్థులు ఆంగ్ల విద్యను అభ్యసించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన ఆంగ్ల యూనివర్శిటీని ఏర్పాటు చేయాలి. యూనివర్శిటీ స్థాపనకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలని పలువురు ముస్లింలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల సందర్భంగా ముస్లింలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలి. 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. ఈ ఫలాలు ముస్లింలందరికీ చేరేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ సచార్‌ కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ముస్లింల అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే ముస్లింలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతారని పలువురు సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు ఆకాంక్షిస్తున్నారు.