సమైక్య స్ఫూర్తి దేశాభివృద్ధికి దోహదం
ముఖ్యమంత్రులతో మూడు కమిటీలు
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(జనంసాక్షి): సమాఖ్య స్ఫూర్తి దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రదాని నరేంద్రమోడీ అన్నారు. దేశాభివృద్ధికి ప్రణాళికలు రూపొందింఛడం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సమావేశంలో పీఎం మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పిస్తామని ప్రధాని పేర్కొన్నారు. సమావేశంలో ఆయా రాష్ట్రాలు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలపై చర్చించారు. జన్‌ధన్‌యోజన పథకం సక్సెస్ గురించి ఈ సందర్భంగా ప్రదాని అందరి భాగస్వామ్యంతో సక్సెస్ సాధింఛినట్లు తెలిపారు. పలు రాష్ట్రాలు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులు తమకు విలువైన సమాచారం ఇచ్చారని ప్రధాని మోడీ తెలిపారు. ముఖ్యమంత్రులతో మూడు కమిటీలు నియమించి దేశాభివృద్ధిలో మరింథ వేగంగా పనిచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఒక ముఖ్యమంత్రుల కమిటీ, మానవ వనరుల అభివృద్ధికి మరో కమిటీ, స్వచ్ఛభారత్‌కోసం మరో ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సుదీర్ఘంగా నీతి ఆయోగ్ సమావేశం విజయవతంగా ముగిసింది. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, విదేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణ, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై వంటి పలు అంశాలను గురించి చర్చించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు దేశ పురోభివృద్ధికి దోహదపడుతాయని ఆయన అన్నారు. విధానాల రూపకల్పన, సుపరిపాలన అందించడంపై ముఖ్యమంత్రులు దృష్టిపెట్టాలని ఆ సందర్భంగా ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ తొలి సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.