సర్కారును సీసాలో బంధించిన మద్యం మాఫియా
రాష్ట్రంలో మంచి నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే మహిళల తల రాత నేటికీ మారకపోయినా వీధికొక మద్యం దుకాణం మాత్రం నిరాటంకంగా నడుస్తోంది. మద్యంపై మహిళలు అలుపెరగని పోరాటం చేస్తూ ఏరులై పారకుండా రద్దు చేయించుకున్నారు. కాని అతివల పోరాటం మూణ్నాళ్ల ముచ్చటగా చేస్తూ ఎన్టీఆర్ తదనంతరం వచ్చిన చంద్రబాబు మళ్లీ మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు ఇచ్చేశారు. ఆయనే ఈ రోజు మద్యం ఫుల్.. మంచి నీరు నిల్ అంటూ రాజకీయ ప్రసంగాలు చేస్తూ జనాన్ని ఆకట్టుకునే జిమ్మిక్కులు చేస్తున్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో జరిగని అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి ఏడాది మద్యం దొంగలు ప్రభుత్వంపై పట్టుసాధించి తమ అనుచరులకు అప్పనంగా కట్టబెడుతూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. 11 నెలల క్రితం కరీంనగర్‌లో పెద్ద మొత్తం నగదుతో వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేయడంతో మద్యం కుంభకోణం ఏ స్థాయిలో, ఎవరెవరి అండదండలతో సాగుతుందో వెల్లడైంది. అబ్కారీ అవినీతి బాగోతాన్ని వెలికి తీసేందుకు సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఉపక్రమించినా దానికి కల్పించే ఆటంకాలు అన్నీఇన్నీ కావు. అవసరమైతే నిజాయితీ పరులైన అధికారులను నిర్ధాక్షిణ్యంగా బదిలీ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న మద్యం మాఫియాపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అందుకే కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ లాంటి సీనియర్ మంత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్న నేతల్లో మాఫియా డాన్‌లు ఉన్నారని, వీరి వల్ల పార్టీ నాశనమవుతోందని వాపోతూ ఏకంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదిలా ఉండగా, ఏసీబీ దర్యాప్తునకు అడుగడుగునా ఆటంకాలను ఏ విధంగా కల్పించాలని మొత్తం మంత్రివర్గమే కూలంకషంగా చర్చించిందంటే రాష్ట్ర ప్రభుత్వంపై మద్యం మాఫియా ఏ విధంగా పెత్తనం చెలయిస్తుందో అర్థమవుతోంది. ఏసీబీ చేసిన దర్యాప్తులో మద్యం సిండికేట్‌లో దాదాపు 20 మంది మంత్రులు, 120 మంది ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎక్సైజ్ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మొదలుకుని ఎవరెవరికీ ఎంత మొత్తంలో మామూళ్లు అందుతున్నాయో రహస్య డైరీ ఏసీబీ చేతికి చిక్కడంతో అసలు గుట్టు బయటపడింది. సిండికేట్లపై దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు, బినామీలపై 48 కేసులు పెట్టి 135 మందిని ఏసీబీ నిర్బంధించింది. దీంతో ఖంగుతిన్న ప్రభుత్వం ఇలా ఏసీబీ నిజాయితీగా దర్యాప్తు చేస్తే ప్రభుత్వం, పార్టీ భ్రష్టు పడతాయని మంత్రి వర్గం ఆందోళన వ్యక్తం చేయడంతో పక్షం రోజుల్లోనే ఏసీబీలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేసింది. తదనంతరం మరో నెలరోజుల్లోనే ఏసీబీలో ప్రత్యేక దర్యాప్తు బృందంలోని కీలకమైన అధికారిని మార్చేసింది. దర్యాప్తునకు సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు అవసరమైనా నేరుగా తననే సంప్రదించవచ్చని ఉన్నత న్యాయస్థానం సైతం జోక్యం చేసుకుని ఏప్రిల్‌లో భరోసా ఇచ్చినా తదుపరి దర్యాప్తు అంతా నిస్సారంగా జరిగింది. ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రిని జైలుకెళ్లి మరీ విచారించి డైరీలో రాసుకున్న పలువురి ఎమ్మెల్యేల వాంగ్మూలాలను నమోదు చేసిన ఏసీబీ రాజకీయ నేతల ఆధిపత్యానికి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. కోర్టులు ఎంత వెనకుండి ముందుకు నడిపిస్తున్నా మాఫియాదే పై చేయి అవుతోంది. ఏడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పుబడుతూ మొట్టికాయలు వేసినా దులుపరించేసుకుని మళ్లీ ప్రభుత్వం మొదటికే వచ్చింది. మద్యం మాఫియా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడం వల్ల కోర్టు లు సైతం తప్పుతోవ పడుతూ సరైన తీర్పులు ఇవ్వలేకపోతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. 2005-06 నాటికి రూ. 5,300 కోట్లు ఉన్న మద్యం అమ్మకాలు నేడు రూ.18,555కోట్లకు పెరిగాయి. పక్క రాష్ట్రాల నుంచి తెస్తున్న కల్తీ సరుకు వంటి వాటి వల్ల మాఫియా శక్తుల ఆరాచక దోపిడీ వల్ల మొత్తం రూ.800 కోట్ల మేర ప్రభుత్వం నష్టపోతోంది. వ్యసనపరుల నెత్తురు పీల్చి రాజకీయ, మాఫియా జలగలు వేలాది కోట్ల రూపాయల ప్రజల నుంచి లూటీ చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 5,239 మద్యం దుకాణాలు ఉంటే వాటిలో తెల్లకార్డులదారుల పేరుతో బినామీలు 2,373 దుకాణాలు నడిపిస్తున్నారు. ఈ విధంగా 60 శాతానికిపైగా మద్యం దుకాణాలను తమ గుప్పిట్లో పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదిస్తూ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ శక్తులను, అధికారులను తమ గుప్పెట పెట్టుకున్న పెద్ద మనుషుల జాబితా ఏసీబీకి తెలిసినా కాని స్పష్టమైన దర్యాప్తు చేయడానికి దాని కాళ్లు ముందుకు సాగనివ్వకుండా తెరచాటు సూత్రధారులు పన్నే వ్యూహం అంతాఇంతా కాదు. ఏసీబీ విచారణపై తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసిన వారు విన్నవించుకున్నా ఏసీబీ మాత్రం తన విచారణ పూర్తి చేసి నివేదికను కోర్టు ముందు ఉంచింది. ఈ నివేదికలో అసలు దొంగలు ఉన్నారో, లేదో తెలియదు కాని ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ నెలకొంది.