సర్కారు బడికి స్కూల్‌ బస్సు ఇవ్వండి..!!

కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ బడులను ఎదిగించండి

కేరళ తరహా విద్యా విధానం తెలంగాణకు అవసరం

ఇంటి నుంచి అప్‌ అండ్‌ డౌన్‌తో డ్రాపౌట్‌లు ఔట్‌

మారుమూల ప్రాంత పేద విద్యార్థులకు ఉచిత బస్సుతో మేలు

ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాలను ఆధునీకరిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రయాణ సౌకర్యం లేక ఇప్పటికీ ఉన్నత విద్యకు నిరుపేదలు దూరమవుతున్న పరిస్థితి. తమ గ్రామాలకు బస్సులు రావడం లేదని, సకాలంలో రాక పాఠశాలలకు కూడా వెళ్లలేకపోతున్నామని ఎన్నోచోట్ల రోడ్డుపై బైటాయిస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవలే రంగారెడ్డి, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు మెరుపు ధర్నా చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం వారి ఆవేదనను బయటపెట్టింది. ఇలా మరెన్నో ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నా ఏండ్ల తరబడి మెరుగైన ప్రయాణానికి నోచక కాలిబాటన, సైకిళ్ల మీద ప్రయాసగా పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి. పేద, మధ్య తరగతి పిల్లలకు సమగ్ర విద్య అందాలంటే సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కేరళ తరహా ప్రగతిశీల నిర్ణయాలను తీసుకోవాలని విద్యావంతులు విన్నవిస్తున్నారు. కేరళలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం కేఎస్‌ఆర్‌టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టే తెలంగాణలో టీఎస్‌ఆర్‌టీసీ చొరవ చూపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌ కరస్పాండెంట్‌ (జనంసాక్షి)
పేదరిక నిర్మూలన కోసం బహుళ దశ ప్రణాళికలతో సాగుతున్న కేరళ ప్రభుత్వం గతేడాది తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తోంది. అందరికీ సమాన విద్యనందించాలనే లక్ష్యంతో నిరుపేద పిల్లల కోసం చదువును మరింత దగ్గర చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టింది. డోర్‌ టు డోర్‌ సర్వే చేసి నిరుపేద విద్యార్థుల డేటాను సేకరించి వారందరికీ మెరుగైన విద్యనందించేలా కొత్త ప్రణాళికను తీసుకొచ్చింది. కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (కేఎస్‌ఆర్‌టీసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో 64వేల కుటుంబాలు అత్యంత నిరుపేద కుటుంబాలున్నట్టు వెల్లడవగా.. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పడుతున్నారు. దేశంలోనే 100శాతం అక్షరాస్యత గత కేరళలో ఈ ఉచిత బస్సు సౌకర్యం పేద విద్యార్థుల ఉన్నత చదువులకూ అమలు చేయాలని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించడాన్ని విద్యావంతులు స్వాగతిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు నవంబర్‌ 2025లోపు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. 2023ను మొదటి దశగా, 2024 సంవత్సరాన్ని రెండో దశగా, 2025 నవంబర్‌ వరకు చివరి దశగా నిర్ణయించుకుని మల్టీ ఫేస్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది. పదో తరగతి తర్వాత కూడా ఉన్నత విద్య కోసం ఈ ఫ్రీ బస్‌ స్కీమ్‌ కొనసాగిస్తామని పినరయీ ప్రభుత్వం వెల్లడిరచడం పేదలకు ఊరటనిస్తోంది.
వెళ్లలేక వెనుక‘బడి’
ఏజెన్సీ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సుల్లేక వెనుకబడిపోతున్నారు. ప్రయివేటు స్కూళ్లలో మాత్రం అందులోనే బస్సు సౌకర్యం ఉండటంతో అదనపు ఫీజులు చెల్లించి పిల్లలను బడికి పంపుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 26 వేలు ఉండగా.. రమారమి 28 లక్షల మంది విద్యార్థులున్నారు. స్థోమత లేనివారు, సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని భావించేవారు తమ పిల్లలను పంపుతున్నారు. ప్రాథమిక స్థాయి విద్య స్వగ్రామాల్లోనే అందుతుండగా.. ఆపై తరగతుల కోసం పక్కనున్న గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూళ్లకు కిలోమీటర్ల మేర ప్రయాణించి వేలాది మంది విద్యార్థులు ప్రయాణ ప్రయాసకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో బస్సుల్లేక ఆలస్యమై పరీక్షలకు కూడా దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు :
బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో  షాద్‌నగర్‌ పట్టణంలో గత మూడు రోజుల క్రితం మెరుపుధర్నాకు దిగిన విద్యార్థులు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి ఆదర్శ పాఠశాలకు వచ్చేందుకు వివిధ గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతం కంటే ఆర్టీసీ బస్సు ట్రిప్పులు తగ్గించడంతో ఒక్కో బస్సులో వందకుపైగా మంది ఊపిరాడని పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు లోకేశ్వరం మండలం కనకాపూర్‌ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ఐదు కిలోమీటర్లు వివిధ వాహనాలపై వెళ్తున్నారు. ఈ మార్గంలో బస్సులు రాకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఇతర వాహనాలపై ప్రయాణిస్తున్నారు.బీబీపేట మండలంలో బస్సులు సకాలంలో బస్సులు నడపడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు వికారాబాద్‌ జిల్లా పరిగి, గడిసింగాపూర్‌ మీదుగా కిష్టాపూర్‌కు బస్సులు సకాలంలో బస్సులు నడపడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్నారు.గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్‌దోడ్డి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లేందుకు పరిసర ప్రాంతాల విద్యార్థులు లిఫ్టులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు.సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో ఉన్నత పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యం కరువై నిత్యం ప్రయాణ పాట్లు పడుతున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే దాదాపు లక్షన్నర మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులుండటం గమనార్హం.జగిత్యాల జిల్లా బీమారం మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తిరిగి ఇంటికి రావాలంటే బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూస్తున్న పరిస్థితులు వారి ఆందోళనకు కారణమవుతోంది.
వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి ఇబ్బందుల నడుమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకోవడం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యావంతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కొన్ని జిల్లాల్లో పరీక్షల సమయంలో బస్సులు ఆలస్యమై పరీక్షకు దూరమైన సందర్భాలున్నాయని చెబతున్నారు. ఆర్టీసీ డీఎంలకు ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్తున్నప్పటికీ పరిస్థితులు మారక, బస్సులు రాక తరచూ విద్యార్థులు ధర్నాలకు దిగుతుండటం తెలంగాణవ్యాప్తంగా నిత్యకృత్యంగా మారిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహిస్తున్నారు. అందుకే కేరళ తరహాలో ప్రభుత్వ పాఠశాలలు, ఆపై సర్కారు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ విద్య మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వెనుకబడిన పిల్లల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని సర్కారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతున్నారు.