సర్కారు హింసను నమ్ముకుంది

జనబలంతో చలో అసెంబ్లీ
అణచివేతను అధిగమిస్తాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) :
రాష్ట్ర సర్కారు హింసను నమ్ముకుందని, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎంతగా అణచివేయాలని చూసినా జనబలంతో చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఐకాస నేతలు పిట్టల రవీందర్‌, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీని నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆటంకాలు ఎదిరించి తాము ఛలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పూటకో మాట చెబుతోందని మండిపడ్డారు. తెలంగాణపై ఆ పార్టీ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉందన్నారు. తెలంగాణ రాష్టాన్న్రి కాంగ్రెస్‌ ఎప్పటికీ కూడా ఇవ్వదని ఆపార్టీ నాయకుల వ్యాఖ్యల వల్లే తేలిపోతుందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తికి ఎంత అవగాహన ఉండాలో అంతలేదని ఆజాద్‌పై నిప్పులు చెరిగారు. కేకే, వివేక్‌, జగన్నాథం పార్టీ  వీడినప్పుడు స్పందించిన ఆజాద్‌ జూన్‌నెలలోనే అంటే నెలలోపే తెలంగాణపై కాంగ్రెస్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించి, మళ్లీ ఇరవైనాలుగు గంటలు కూడా కాకముందే సంప్రదింపులు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పడం చూస్తుంటే చిన్న పిల్లాడి మాటల్లాఉన్నాయన్నారు. అంటే ఇంకెవరూ కాంగ్రెస్‌ను వీడకుండా ఉండాలనే తప్ప నిజాయితీ కనిపించలేదన్నారు. ఆయన మాటలను ఆయనే తుంగలో తొక్కుతూ రోజుకో మాట మాట్లాడుతూ తెలంగాణా ప్రజలను అవమాన పరుస్తున్నారని కాంగ్రెస్‌ నేతలపై విరుచుకు పడ్డారు. అసలే  కిరణ్‌ కుమార్‌రెడ్డి మూఠాల సంస్కృతి, సంప్రదాయాల నుంచివచ్చిన వ్యక్తి అన్నారు. ఆయన మూటాలను తెలంగాణ నేత లపై ప్రయోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని కోదండరామ్‌ ఆరోపించారు.
తెలంగాణ నేతలకు బెదిరింపు ఫోన్లు
తెలంగాణ ఉద్యమకారులకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. బుధవారం తెలంగాణ ఉద్యోగాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, తెలంగాణ రాజకీయ జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్‌కు ఈ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవద్దని, ఒకవేళ తమ మాటను బేఖాతరు చేస్తే చంపేస్తామని వారు హెచ్చరించారు. దీంతో ఈ ఇద్దరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న నేతలకు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12 నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంలోనే ఈ నెల 14న జేఏసీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున నిర్వహించేందుకు జేఏసీ కసరత్తు చేస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌, న్యూడెమెక్రసీ పార్టీలతో పాటు పలు తెలంగాణ ఉద్యమ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నెల 5వ తేదీ నుండి 15వరకు శాసనసభల దృష్ట్యా నగరంలో ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ఇప్పటికే ఆంక్షలు పెట్టారు. చలో అసెంబ్లీ అడ్డుకోవడాన్ని ప్రభుత్వం కూడా ప్రతిష్టగా తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం వెనుకాముందు ఆలోచించవద్దని శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం పెట్టవద్దంటూ ఇప్పటికే డీజీపీకి మౌఖికంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జేఏసీ నాయకులకు ఫోన్‌ కాల్స్‌ రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసులే ఈ రకమైనా చర్యలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.