సర్వతోముఖాభివృద్ధి సర్కారు లక్ష్యం
మైనారిటీలు, దళిత బలహీనుల సంక్షేమానికి కృషి
5.3 శాతం వృద్ధి రేటు
ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్,మార్చి7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే సర్కారు లక్ష్యమని గవర్నర్ నరసింహన్ స్పష్టంచేశారు. ముఖ్యంగా మైనారిటీలను, దళితులను, బడుగు బలహీన వర్గాల ప్రజలను ప్రగతి పథాన నడపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గవర్నర్ ప్రసంగంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇప్పటి వరకు చేపట్టిన పనులు, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టబోయే కార్యక్రమాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. కొత్తగా సాధించుకున్న తెలంగాణలో నూతన ఒరవడితో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. గోల్కొండలో పంద్రాగస్ట్ వేడుకల నిర్వహణ ఇందుకు తార్కాణమన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభంకాగా , ఉభయలసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉందని, సభ్యులందరికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. పేద, బడుగు జీవుల కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడితో నడుస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం అమలులోకి తెచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. మిషన్ కాకతీయతో 45 వేల చెరువుల పునరుద్దరణకు చర్యలు తీసుకున్నామన్నారు. వాటర్ గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై వేధింపుల నిరోధానికి షీటీమ్‌ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది వృద్ధిరేటు 5.3 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సేవారంగంలో మైనార్టీలో సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించామన్నారు. సింగిల్ విండో పద్దతిలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వనున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమని పంపిణీ చేస్తామన్నారు. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందజేయనున్నట్లు తెలిపారు. త్వరలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వైఫై సేవలు అందజేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల నిధులు రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం కృషి చేస్తున్నట్లు గవర్నర్ అన్నారు.
గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం
గవర్నర్ ప్రసంగం సాగుతుండగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లేందుకు విపక్ష సభ్యులు యత్నించడంతో టీఆర్‌ఎస్ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రామ్మోహన్‌రెడ్డిలను టీఆర్‌ఎస్ సభ్యులు నెట్టివేశారు. దీంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని 15 నిమిషాల్లోపే ముగించారు. దళితవాడల్లో దారిద్రాన్ని పోగోట్టడానికి 3 ఎకరాల భూపంపిణీ పథకం చేపట్టమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ చేపట్టామని అన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. మహిళల భధ్రత కోసం షి టీమ్స్‌ఏర్పాటుచేశామన్నారు. ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధిన్యం ఇస్తూ, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీటిని అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నమన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను అమలు చేస్తున్నామని అన్నారు. ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం తీసుకున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సింగిల్ విండో పారిశ్రామిక విధానం అమల్లోకి తెచ్చమన్నారు. ఐటీఐఆర్ ద్వారా 50 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారం ఏర్పాటుకు కృషి జరుగుతోందని అన్నారు. బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండగలుగా గుర్తించి అందుకు తగ్గట్లుగా వాటిని నిర్వహించామన్నారు. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, సీఐడీ విచారణ తరువాత గృహనిర్మాణ పథకం చేపడతామన్నారు. జర్నలిస్టులు, లాయర్ల సంక్షేమం కోసం రూ.100 కోట్ల ఫండ్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తామన్నారు. వ్యవసాయంలో వృద్ధి బాగా లేకున్నా… అభివృద్ధి కొనసాగుతోందని, రైతులకు అండగా ఉండేందుకు భూసార కార్డులు అందిస్తామన్నారు. ఉపాధి లేని వృద్ధులకు ఆసరా పథకం కొనసాగుతుందన్నారు. వికలాంగులకు నెలకు రూ.1500 పింఛను అందిస్తున్నాం. భూమిలేని పేదలకు భూపంపిణీ చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటూ, సామాజిక వనాల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రధాన నదుల నుంచి నీటివాటా కోసం నిరంతర ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి జరుగుతోందని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆరోగ్యకార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, రాష్ట్రంలో 14 నగరాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేపడతామని అన్నారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగం పావుగంటలో ముగిసింది. అయితే ఇక్కడ అంతా గందరగోళంగా సాగింది. ఉపన్యాసం అంతసేపు గొడవ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. చివరిగా తెలుగులో గవర్నర్ ప్రసంగం చదివి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని సంస్కృత శ్లోకంతో ముగించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ కు రక్షణకవచంగా నిలిచి టిడిపి, కాంగ్రెస్ సభ్యులను నిలువరించారు.
నెలాఖరు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెలాఖరుల వరకు జరిపే అవకాశాలు ఉన్నాయి. 11న బడ్జెట్ సమర్పణ ఉంటుంది. సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం సభాపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార, విపక్షాల సభ్యులు పాల్గొన్నారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఈవిధంగా ఉన్నాయి… మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అసెంబ్లీకి సెలవు. ప్రకటించారు. తిరిగి సభ సోమవారం సమావేశం కానుంది. సభలో జాతీయ గీతం పాడిన సమయంలో బెంచీలపై నిలబడ్డవారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ తీర్మానానికి టీడీపీ మినహా మిగతా పార్టీలు చర్యలు తీసుకోవాలని కోరాయి. 9, 10వ తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ ఉంటుంది. అనంతరం 11న బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ 26న అసెంబ్లీలో అదేవిధంగా 27న మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. ఈ నెల 28, 29న సభకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. . అవసరమైతే 30, 31న సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.