సాకారమైన దశాబ్దాల కల..

పడావు భూములకు కృష్ణమ్మ పరుగులు
` పాలమూరు ఎత్తిపోతల జల
` ప్రపంచంలోనే అతిభారీ మోటార్లు షురూ..
` ఆగం కావొద్దు.. అభివృద్ధి ఆపోద్దు
` బీడువారిన ఊరుకు జలకళ
` పల్లెర్ల నేలపై కృష్ణమ్మ జలసిరులు
` పాలమూరు గడ్డపై కృష్ణమ్మ గలగల..
` పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం
` ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): కరవు సీమలో పొంగిపొర్లిన పాతాళ గంగమ్మను చూసి పాలమూరు ఉప్పొంగింది. వలసలతో అల్లాడిన పల్లెర్ల నేలపై కృష్ణమ్మ జలసిరులను చూసి మురిసిపోయింది. కన్నీటి పాటల్లోంచి కదిలొస్తూ.. బీడువారిన ఊరుకు జల హారతి పట్టే ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ ఆశతో ఎదురూచూస్తున్న పల్లె జనం పరవశించిపోయింది. దశాబ్దాల స్వప్నం సాకారమయ్యేలా ప్రారంభమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం పండుగలా జరిగింది. నార్లాపూర్‌లో తొలి మోటార్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. శ్రీశైలం వెనక జలాలను మొదటి దశలోఎత్తిపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ నుంచి పలువురు మంత్రులు, అధికారులతో కలిసి రోడ్డుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్‌ కు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని నార్లాపూర్‌ వద్ద మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌ కంట్రోల్‌ రూం వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత పాలమూరు-రంగారెడ్డి పథకం పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన ప్రత్యేక పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అక్కడి నుంచి డెలివరీ సిస్టర్న్‌ వద్దకు చేరుకుని.. శ్రీశైలం వెనక జలాల నుంచి ఎత్తిపోస్తున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు గంగమ్మకు సారె, పూలను సమర్పించారు. ఆ తర్వాత మొదటి దశ పంపింగ్‌ను ముఖ్యమంత్రి స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించారు.  మొదటి దశ పంపింగ్‌ ఆన్‌ చేయటంతో శ్రీశైలం వెనక జలాల నుంచి అప్రోచ్‌ కెనాల్‌, ఇంటెక్‌ వెల్‌, సొరంగ మార్గాల ద్వారా అప్పటికే సర్జ్‌పూల్‌కు చేరిన కృష్ణా జలాలు మొదటి పంపు నుంచి డెలివరీ సిస్టర్న్‌ ద్వారా నార్లాపూర్‌ జలాశయానికి చేరుకున్నాయి. గ్రామ దేవతలకు అభిషేకించేందుకు కృష్ణా జలాలతో నింపిన కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ అందజేశారు. నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్దకు అధికారులు మినహా ఇతరులెవ్వరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వస్తున్నందున 3 వేల మంది సిబ్బందితో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం నేరుగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. అక్కడి నుంచి కొల్లాపూర్‌ సమీపంలోని సింగోటం కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు హాజరయ్యే విధంగా.. ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేల మంది చొప్పున బహిరంగ సభకు తరలించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతికి అంకితం చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ప్రపంచంలోనే అతి పెద్దదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వలసల జిల్లా అయిన పాలమూరుకు.. 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆదిలాబాద్‌లో నూతనంగా నిర్మించిన డీసీఎంఎస్‌ గోదాం సముదాయాన్ని ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్‌రావు, రాఠోడ్‌ బాపూరావులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ తిప్పని లింగయ్యను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించారు. మరోవైపు  ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగు నీరు.. హైదరాబాద్‌కు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టింది. పనుల ప్రారంభం నుంచి పలు అడ్డంకులు ఎదురైనా దాటుకుంటూ పనులను పూర్తి చేస్తోంది. సుమారు 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగు నీరు.. 1226 గ్రామాలకు పైగా తాగు నీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చాలని సర్కారు ఈ పథకానికి రూపకల్పన చేసింది. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదట ప్రాజెక్టు చేపట్టగా.. తర్వాత ఆ మొత్తం రూ.55 వేల కోట్లకు పెంచారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుపై ప్రభుత్వం రూ.26 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్‌హౌస్‌లు, బహిరంగ కాలువలు, సొరంగ మార్గాలు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, కంట్రోల్‌ యూనిట్లు ఉన్నాయి. అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా హెడ్‌ రెగ్యులేటరీ నుంచి వచ్చిన కృష్టా జలాలను 9 మీటర్ల వ్యాసంతో ఉన్న సొరంగ మార్గాల ద్వారా నార్లాపూర్‌ సర్జిపూల్‌ కు పంపిస్తారు. చెరువును తలపించే నార్లాపూర్‌ సర్జిపూల్‌ పొడవు 255 మీటర్లు.. వెడల్పు 21 మీటర్లు.. లోతు 74 మీటర్లుగా ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. సర్జిపూల్‌లో దాదాపు 24 వేల క్యూసెక్కుల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. నిల్వ చేసిన నీటిని పంపుల ద్వారా పైకి ఎత్తిపోస్తారు. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్‌, కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 67.74 టీఎంసీలు. కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద తలపెట్టిన జలాశయం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇందుకోసం నిర్మించిన 5 పంప్‌హౌసుల్లో మొత్తం 35 భారీ పంపులు ఏర్పాటు చేస్తున్నారు. సివిల్‌ పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా.. ఇక్కడ వినియోగించే పంపుల గరిష్ఠ సామర్థ్యం 145 మెగావాట్లు. ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తున్న సొరంగాల మార్గం పొడవు 61.57 కిలోమీటర్లు కాగా.. కాలువల పొడవు 915.47 కిలోమీటర్లు. భూగర్భంలోనే భారీ పంప్‌ హౌస్‌లతో పాటు ఆసియాలోనే అతి పెద్దవైన సర్జ్‌పూల్‌లు నిర్మించారు. పర్యావరణ అనుమతులు లభించని కారణంగా మొదటి దశలో తాగు నీటి కోసమే పనులు చేపట్టారు. సివిల్‌ పనులు పూర్తి చేసి కొన్ని పంపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం చేశారు. రెండో పర్యావరణ అనుమతులను కూడా ఈఏసీ ఇటీవలే సిఫారసు చేసింది. దీంతో రెండో దశలో సాగునీటి పనులను కూడా వేగవంతం చేయనున్నారు. మిగిలిన పంపుల ఏర్పాటుతో పాటు కాల్వల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎత్తిపోతల పథకంలో రెండో, అతి పెద్దది ఏదుల పంప్‌హౌస్‌. 10 పంపుల సామర్థ్యంతో ఏదుల పంప్‌హౌస్‌ను నిర్మించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ల సామర్థ్యం గల అతిపెద్ద పంపులు ఏర్పాటు చేశారు. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన వాటి కంటే పెద్దవని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో.. భవిష్యత్‌ తరాలకు అనుగుణంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు ఆయన చెబుతున్నారు.

తాజావార్తలు