సాగుచట్టాల రద్దును స్వాగతించిన టిఆర్‌ఎస్
ప్రజాశక్తి ముందు ప్రభుత్వం తలవంచింది
భారతీయ రైతులు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించారు
మోడీ నిర్ణయంపై కెటిఆర్ తదితరుల స్పందన
హైదరాబాద్,నవంబర్19(జనం సాక్షి ) నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్ స్పందించింది. ఇది ప్రజా విజయమని వ్యాఖ్యానించింది. దీనిపై మంత్రులు స్పందించి మోడీ దిగిరాక తప్పలేదన్నారు. అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రైతుల చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ సర్కార్ ముందున్న విషయం తెలిసిందేనని అన్నారు. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన కూడా చేపట్టింది. భారతీయ రైతులు మరోసారి తమ సత్తాను చాటారని, అవిశ్రాంత పోరాటం వల్ల తమ డిమాండ్లను సాధించుకున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఆ కామెంట్‌కు ఆయన విజయసూచిక ఉన్న ఎమోజీని కూడా పోస్టు చేశారు. జైకిసాన్, జై జవాన్ అంటూ తన ట్వీట్‌లో మంత్రి కామెంట్ చేశారు. ఫార్మ్‌లాస్‌రిపీల్డ్, టీఆర్‌ఎస్ విత్ ఫార్మర్స్, ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా మంత్రి తన ట్వీట్‌లో పోస్టు చేశారు. రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతుశక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయమని ట్వీట్ చేశారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లవ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ కానన్లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు’ అని మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో పోస్టు చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. రైతులకు మద్ధతుగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమసెగ ఢల్లీికి తగిలిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారికోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించిన అన్నదాతలకు అభినందనలు తెలిపారు. సాగు చట్టాల రద్దు.. రైతుల విజయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ªుద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన పోరాడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఈ భయంతోనే వివాదాస్పద చట్టాలను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారని తాము భావిస్తున్నామన్నారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకుండానే ఇన్ని రోజులు సాగాయని, కేసీఆర్ చేపట్టిన మహాధర్నా.. రైతులకు నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోదీ నమ్మారని తెలిపారు. ఈ సెగ ఢల్లీి వరకు చేరుతుందనే భయంతోనే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. చట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన టీఆరెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. సాగు చట్టాలను కేందప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అసువులుబాసిన రైతులకు కన్నీటి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి మించి మరేదాన్ని పాలకులు ప్రామాణికంగా తీసుకోవడానికి వీళ్లేదన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నా, తెలంగాణ రైతాంగం నిరసనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ పోరాట స్ఫూర్తి ప్రధాని మోదీకి తెలుసునని చెప్పారు. రైతుల ఉద్యమం ఉధృత రూపం దాల్చకముందే ధాన్యం కొనుగోళ్లలోనూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.