సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

1

-హరీష్‌

హైదరాబాద్‌,మార్చి 23 (జనంసాక్షి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులనన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.  రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికపద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ఈపీసీ సిస్టమ్‌ ఇకపై రాష్ట్రంలో ఉండదని తెలిపారు. ఎల్‌ఎస్‌ సిస్టమ్‌లోనే టెండర్లును పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకతీయ రాజుల నుంచి వారసత్వంగా వచ్చిన చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి గనుక చెరువు నిండితే వచ్చే నాలుగు సంవత్సరాల వరకు గ్రామాలకు ఎలాంటి లోటు ఉండదని వివరించారు. ఇదిలావుంటే  రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధిహావిూ పథకానికి తూట్లు పొడిచే విధానాలను సర్కార్‌ తిప్పికొట్టాలని రాజయ్య కోరారు. ఈ పథకానికి నిధులు ఎక్కువగా కేటాయించాలన్నారు. దళితులు, గిరిజనులు అభివృద్ధికి మరో రూ.5వందల కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. బ్యాంకుల ద్వారా కొత్త అప్పులు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు ప్రభుత్వం భరోసా, ధైర్యం కల్పించాలన్నారు. ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి.. ఆత్మహత్యల నివారణకు కొత్త చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నగరంలో గుడిసెవాసులను రెగ్యూలరైజ్‌ చేస్తామంటూనే.. ఉన్న గుడిసెలను పీకేస్తున్నారనిరవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఆస్తిపన్ను పేరిట అధికారులు అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సిబ్బంది కొరత లేకుండా గ్రామాల్లో రిక్రూట్‌మెంట్లు జరగాలన్నారు. గ్రామాల్లో వార్డు మెంబర్లకు కూడా వేతనం పెంచాలని కోరారు.