‘సాగునీటి’ సావులు…!

హుజురాబాద్‌, జనంసాక్షి: 30 ఏళ్ల కిందట చెరువుల నిర్వాహణ మొత్తం ఆయాగ్రామాల రైతులే చూసుకునేవారు. ఏనాడు గొడవలు జరిగేవి కావు. చెరువు నీరటి కాడే అందరి రైతుల పొలాలకు క్రమం తప్పకుండా నీరందించే వాడు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. నీరటి వ్యవస్థనుమరుగైంది. అధికారులు పట్టించుకోకపోవడంతో పొలాలకు నీటి సరాఫరా విషయంలో రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఇవి కాస్తా హత్యలకు దారి తీస్తుండడం ఆందోళనకరంగా మారింది. రెండు రోజుల్లోనే సాగునీటి వివాదాల మూలంగా ఇద్దరు రైతులు హతమవడం చూస్తుంటే పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. శంకరపట్నం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గాజుల ప్రకాష్‌ అనే రైతు ఆదివారం రాత్రి తన పొలానికి ఎస్సాస్సీ కాలువ నీటిని పెట్టేందుకు వెళ్లిమన్నడు శవమై కనిపించాడు.

సాగునీటి సరఫరా విషయంలో తలెత్తిన విభేదాలే ప్రకాష్‌ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మరో ముగ్గురు రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయం మరిచిపోక ముందే మంగళవారం మరో సంఘటన వెలుగు చూసింది. కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లికి చెందిన బొడిగె తిరుపతి అర్ధరాత్రి చెరువు నీటిని తన పొలానికి మళ్లించేందుకు వెళ్లిన క్రమంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కొట్టాటలో తిరుపతి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

గత నెలలో కాకతీయ కాలువ నీటి చౌర్యాన్ని అడ్డుకునేందుకు సైదాపూర్‌ మండల పరిధిలోని సోమారం గ్రామం వద్ద కాపాలా ఉండి అనుమానస్పద స్థితిలో కాలువలో శవమైతేలాడు. అంతకుముందు అదే ఎస్కేప్‌ కెనాల్‌ వద్ద రైతులకు, అధికారులకు వివాదాలు తలెత్తాయి. తాజాగా వీణవంక, శంకరపట్నం మండలాల పరిధిలో వున్న కల్వల ప్రాజెక్టు నీటి విషయంలో కలకలం రేగింది. ప్రాజెక్టులోని నీటితో పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో దిగువ ప్రాంత రైతులు ఆగ్రహించారు. తమ పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో దిగువ ప్రాంత రైతులు ఆగ్రహించారు. తమ పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదంటూ ఆగ్రాహంతో మంగళవారం 150 మంది రైతులు ఎగువ ప్రాంతంలోని మోటర్లను ధ్వంసం చేశారు. ఇవే కాకుండా ఇటీవల సాగునీటి విషయంలో అనేకంగా జగడాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం కొట్లాటలతో గాయాలపాలై పోలీస్‌ స్టేషన్‌ను రైతులు ఆశ్రయిస్తున్నారు.

అధికారుల తీరే కారణం.. ఎస్పాస్సీ కాలువ నీరందించడంలో గాని, చెరువు నీటి విషయంలో గాని అధికారులకు పట్టింపులేని కారణంగానే రైతుల మధ్య జగడాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఎస్సాస్పీ విషయానికి వస్తే మెయిన్‌ కాలువ, డిస్ట్రిబ్యూటరీ, మైనర్‌ కాలువ వరకే సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత ఫీడర్‌ ఛానల్‌ను నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ఫీడర్‌ ఛానళ్ల నుంచి నీటిని మళ్లించే విషయంలో రైతుల మధ్య విభేదాలు పొడ సూపుతున్నాయి. అసలే నీటి లభ్యత తక్కువ ఉండడంతో ముందు తనది పారాలంటే తనదే పారాలని రైతులు కొట్టుకు చస్తున్నారు. ఇక చెరువుల విషయానికి వస్తే సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు కేవలం చెరువు కట్టల మరమ్మతులపైన మాత్రమే దృష్టి సారిస్తున్నారు. చెరువులోని నీటిని ఆయకట్టుకు వదలే కనీస విధానాన్ని రూపొందించడం లేదు.

రిజిస్టర్డ్‌ ఆయకట్టు రైతులంతా నీటిని వాడుకోవచ్చని గంపగుత్తగా చెప్పేస్తున్నారు. ఆదనపు నీటిని మాత్రమే ఇతర రైతులు వినియోగించుకోవాలని నిబంధనలున్నాయి. అయితే చెరువులు పూర్తిగా నిండకపోవడంతో పొలాలు వేసుకున్న రైతుల మధ్య నిత్యం వివాదాలు నడుస్తున్నాయి. ఆయకట్టుకు సంబంధించి రైతులపైనే అధికారులు భారం వేయడంతో ఎలాగైనా పోందకపోతుందా అనే ఆశతో అందరు పొలాలు వేసుకోవడంతో నీరు సరిపోక నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇవి ఎటు దారితీస్తాయోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకుని ప్రతి సీ జన్‌కు డ్యూటీ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని కోరుతున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.