సాగు చేసే ప్రతి భూమికి పెట్టుబడి పథకం అమలు

– నల్గొండ జిల్లా ధాన్య కొనుగోల నెం.1 స్థానంలో ఉంది
– డిండి ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కల్వకుర్తి నుంచి నింపి నీళ్లిచ్చాం
– భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు
– ఇప్పలగుడేని గ్రామంలో గోదాములను ప్రారంభించిన మంత్రులు
నల్లగొండ, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి) : సాగుచేసే ప్రతి భూమికి పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇప్పలగుడేనీ గ్రామంలో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్‌ టున్నుల సామర్ధ్యం గల గోదాములకు మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ఎక్కడ చుసిన ధాన్యం రాశులె కనిపిస్తున్నాయని, చాల ఆనందంగా ఉన్నదన్నారు. సీఎం నాయకత్వంలో ప్రతి చుక్కను వినియోగం చేసుకొని రికార్డ్‌ స్థాయిలో పంటలు పండించామన్నారు. 24గంటల విద్యుత్‌ తో వ్యవసాయంలో అద్భుతం అవిష్కృతం అయిందన్నారు.
నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో నెంబర్‌ వన్‌ స్థానంలో వుంది. డిండి ప్రాజెక్ట్‌ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నింపి నీళ్లిచ్చామన్నారు. సాగర్‌ కింద వారబందితో రైతులకు అందరికి సాగునీరిచ్చామని మంత్రి పేర్కొన్నారు.  తెలంగాణాలో రైతులు సంతోషంగా వున్నారని, అందరికి, సాగుచేసే ప్రతి భూమికి పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తామన్నారు. మరి కొద్ది రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ కింద సాగు నీరు ఇస్తామని, 98 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.  పండించిన పంటకు ఇబ్బంది కాకూడదని గోదాంలను నిర్మిస్తున్నామని, అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టర్ఫాలైన్‌ కవర్లు అందజేశామన్నారు. రవాణా కూడా తొందరగా చేస్తున్నామని, నకేరేకల్‌ లో నెలరోజుల్లో నిమ్మ మార్కెట్‌ ఓపెన్‌ చేస్తామని హరీష్‌రావు తెలిపారు. నల్లగొండలో బత్తాయి మార్కెట్‌ పనులు పూర్తి అయ్యాయని, దాన్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం, స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.