సామాన్యుడి సెకను విలువైనదే..!
దారి మళ్లించే రోజులు పోయాయి.. దారిచ్చే రోజులు వచ్చాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కొత్త సాంప్రదాయం
పౌరులను అడ్డుకోకుండా సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించిన సీఎం
ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలగొద్దని ఇప్పటికే ఆదేశాలు
వీఐపీ సంస్కృతికి చెక్.. నగరవాసుల్లో హర్షాతిరేకలు
హైదరాబాద్ (జనంసాక్షి) :
‘అధికార పీఠంలో కూర్చున్నా సామాన్యుడి బాధ మరవను. ఇది కేవలం కాన్వాయ్ నిర్వహణ కాదు ఇది పాలకుడు పౌరుడికి ఇచ్చే గౌరవం. ఈ సంప్రదాయం కొనసాగితే హైదరాబాద్ రోడ్లపై ప్రతి పౌరుడూ సమానుడే. సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్ వెళ్ళడం పాలనాపరమైన గొప్పతనం కాదు అది కనీస బాధ్యత. కానీ ఆ కనీస బాధ్యతను నిర్వర్తించడమే ఈ వ్యవస్థలో విప్లవంగా కనిపిస్తోందంటే అది మన వీఐపీ సంస్కృతికి పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది’ ఇదీ సీఎం రేవంత్ ఓ నిర్ణయానికి ముందు వ్యక్తం చేసిన ఆవేదన.
తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజలకు ఆటంకం కలిగించొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ని బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణం చేసింది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి రెగ్యులర్ ట్రాఫిక్‌లోనే సీఎం వెళ్లారు. బుధవారం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సీఎం వెంటనే స్పందించి తన కాన్వాయ్ రాకపోకల కోసం హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రజల వాహనాలను నిలిపివేయొద్దంటూ సీనియర్ పోలీసు అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యల్ని పూర్తిగా నివారించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ కదలికల సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడానికి బదులుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఒకే లేన్‌లో కదలడానికి అనుమతించారు.
కొత్త సాంప్రదాయానికి శ్రీకారం
అధికారం చేతిలో ఉన్నప్పుడు సామాన్యుడి సౌకర్యాన్ని మరచిపోవడం పాలకుల పాత అలవాటు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంప్రదాయానికి ఒక్క దెబ్బతో తెరదించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తన అధికారిక నివాసానికి చేరుకునే దారిలో ఎక్కడా ట్రాఫిక్ నిలిపివేయలేదు, ఏ పౌరుడినీ ఆపలేదు. నగరం సాధారణంగా శ్వాసిస్తుండగా, సీఎం కాన్వాయ్ హుందాగా గమ్యం చేరింది. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. కాన్వాయ్ కదులకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను పిలిచి స్పష్టంగా చెప్పారు. ‘నా కోసం సిటీలో వాహనాలు నిలిపివేయొద్దు. పౌరులకు ఇబ్బంది కలిగించే చర్యలు పూర్తిగా నివారించండి’ అన్న ఆదేశం అక్షరాలా అమలైంది. ట్రాఫిక్ పోలీసులు కాన్వాయ్ వెళ్లే వేళ ఒకే వరుసలో వాహనాలను అనుమతిస్తూ సాఫీగా నిర్వహించారు.
వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టిన ఓ నిర్ణయం
దశాబ్దాలుగా భారత నగరాల్లో వీఐపీ కాన్వాయ్‌లు సాధారణ పౌరుల జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. అంబులెన్సులు నిలిచిపోయిన సందర్భాలు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులు గంటల తరబడి ఆగిన ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చిన్నదిగా కనిపించినా పాలనా సంస్కృతిలో పెద్ద మార్పుకు సూచిక. అధికారం అనేది ప్రజలపై ప్రదర్శించేది కాదు, ప్రజల కోసం వినియోగించేది అని ఈ ఒక్క సంఘటన చెప్పింది. రోజువారీ ట్రాఫిక్‌లో ప్రయాణించే హైదరాబాద్ పౌరులు సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారింది. ‘సీఎం రోడ్డు మాదే కాదు, అందరిదీ అని చెప్పారు” అని నెటిజన్లు కొనియాడారు.


