సిండి’కేటు’గాళ్ల దర్యాప్తునకు.. ఇంకెంతకాలం కావాలి ?
ఏసీబీని తలంటిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్ స్కామ్ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారని కోర్టు ప్రశ్నించింది. కేసు దర్యాప్తు వివరాలను రెండు వారాలలోగా అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తును ప్రతి రెండు వారాలకు ఒకసారి కోర్టుకు తెలియజేయాలని కూడా కోర్టు ఆదేశించింది. లిక్కర్ సిండికేట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇకపై ప్రతివారం స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించి నిందితులు ఎవరో తేల్చాలని, వివరాలను కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణంతో నిమిత్తం గల వ్యక్తులపైనా, వారికి సంబంధించిన వారిపైనా తొలి రోజుల్లో దర్యాప్తు చకచక జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయి. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి దర్యాప్తు నత్తనడక నడవడాన్ని కోర్టు ఆక్షేపించింది.