సిడ్నీలో జై తెలంగాణ

ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని బహిష్కరించిన
ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం
సిడ్నీ, (జనంసాక్షి) :ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆదివారం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. అక్కడ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం బహిష్కరించింది. ఈ సందర్భంగా ఫోరం వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్‌ ఏలేటి వినోద్‌రెడ్డి మాట్లాడుతూ, తెలుగుపేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంత ప్రజలను సీమాంధ్రులు ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు, సంప్రదాయాలను అవమానించిన వారితో ఇంకా కలిసి ఉండటం దౌర్భాగ్యమన్నారు. తెలంగాణ భాషను అవమానిస్తూ, అవహేళన చేస్తూ  ప్రపంచ తెలుగుమహోత్సవం నిర్వహించడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచిన కవులు, కళాకారులున్నా వారికి సీమాంధ్ర సర్కారు సరైన గుర్తింపునివ్వలేదన్నారు. దీనిని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని సిడ్ని, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తెలుగు మహోత్సవాన్ని బహిష్కరించామన్నారు. పాల్కుర్కి సోమన్న, బమ్మెర పోతన్న, దాశరథిల ప్రస్తావన లేని, కాకతీయుల వైభవం, శాతవాహన రాజులు నిర్మించిన కోటిలింగాల అక్కడి నుంచి వ్యాప్తిపొందిన తెలుగు చరిత్రను కీర్తించని మహోత్సవం తమకు అక్కరలేదన్నారు. ఏటీఎఫ్‌ ఉపాధ్యక్షులు మరికంటి భావనీరెడ్డి, వినోద్‌ ఈ సందర్భంగా జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఏటీఎఫ్‌ అధ్యక్షుడు గాదె ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, సిడ్నీలోని రోసెల్లి పార్క్‌లో తెలంగాణ వన భోజనం ఏర్పాటు చేసి తెలుగు మహోత్సవానికి వ్యతిరేకంగా ఉద్యమించామన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రంలో తెలంగాణకు వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాన్ని వివరించారు.